గజతుపాన్‌ బాధితులకు భారీగా విరాళాలు

సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో అందచేత

చెన్నై,నవంబర్‌21(జ‌నంసాక్షి): గజ తుపాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలోని డెల్టా జిల్లాల ప్రజలు

తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తుపాను వలన ఎందరో నిరాశ్రయులయ్యారు. కొందరు మృత్యువాత కూడా పడ్డారు. వారిని ఆదుకునేందుకు సినీతారలు ముందుకొచ్చారు. వారికి అండంగా ఉంటామంటూ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇక కొందరు రాజకీయ ప్రముఖులు ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. విపత్తుతో అనాధలైన వారిని ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ముందుకు వస్తున్నారు.ఇప్పటికే నటుడు సూర్య కుటుంబం రూ.50 లక్షలు విరాళం ప్రకటించగా, విజయ్‌ సేతుపతి రూ.25 లక్షల విలువైన వస్తువులను పంపిణీ చేశారు. శంకర్‌ 10 లక్షల విరాళం ఇచ్చారు. 2.0 చిత్ర నిర్మాత, లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాష్‌ కరణ్‌ ఒక కోటి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అలాగే జీవీ ప్రకాష్‌ రెండు లారీలతో నిత్యావసర వస్తువులను డెల్టా జిల్లాలకు పంపించారు. రజనీ బాధితులకి 50 లక్షల విరాళం ప్రకటించారని అంటున్నారు . తాజాగా విజయ్‌ కూడా బాధితులని ఆదుకునేందుకు 50 లక్షల రూపాయలని తన ఫ్యాన్స్‌ క్లబ్‌ ఎకౌంట్‌కి పంపించాడని తెలుస్తుంది. విజయ్‌ పంపిన సొమ్ముని నష్టపోయిన జిల్లాలోని ప్రజలకి వంతులుగా ఆయన అభిమానులు అందించనున్నారట.