గజ తుఫాన్‌తో తమిళనాడు అప్రమత్తం

తీరప్రాంతాల్లో సహాయక చర్యలకు రంగం సిద్దం

భారీ వర్షాలకు ఆస్కారం ఉందన్న వాతావరణశాఖ

చెన్నై,నవంబర్‌14(జ‌నంసాక్షి): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘గజ’ తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పున 570 కిలోవిూటర్లు, నాగపట్నానికి ఈశాన్యంగా 670 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తుపాను గంటకు 6 కిలోవిూటర్ల వేగంతో వాయువ్య పశ్చిమ దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తీరానికి చేరువయ్యే సమయంలో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడులోని తీర ప్రాంతాల్లో

భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొనడంతో తమిళనాడు అప్రమత్తం అయ్యింది. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో దీనిపై అధికారులతో సవిూక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత చేపట్టాల్సిన సహాయ చర్యలపై మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. అరక్కోణం నుంచి 10 జాతీయ విపత్తు బృందాలను తుపాను ప్రభావిత ప్రాంతాలకు పంపారు. ఇందులో మూడు బృందాలు నాగపట్నం, రెండు బృందాలు చిదంబరం వెళ్లాయి. అంతేకాకుండా మొట్టమొదటిసారి స్వచ్ఛంద కార్యకర్తలతో కూడిన ప్రత్యేక బృందాలను అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 4,400 ప్రాంతాల్లో వరద నష్టం ఏర్పడుతుందని అంచనా వేసిన అధికారులు ఆయా ప్రాంతాల్లో అదనపు విపత్తు బృందాలను మోహరించారు. అదేవిధంగా కోస్ట్‌గార్డును అప్రమత్తం చేశారు. సహాయక చర్యల నిమిత్తం 8 పడవలు, మూడు కోస్ట్‌గార్డు విమానాలను సిద్ధంగా ఉంచారు. 30,500 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తాగునీరు, ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నారు. తీరం వెంబడి ఇప్పటికే 60 కి.విూల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను పంబన్‌-కడలూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచే సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు, విల్లుప్పురం, రామనాథపురం, పుదుకో/-టటై జిల్లాలతో పాటు చెన్నై తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో కొన్ని ప్రాంతాల్లో 100 కి.విూ. వేగంతోనూ గాలులు వీస్తాయని సమాచారం. కడలూరు జిల్లాలోని తీర ప్రాంతాల్లో విూటరు ఎత్తున అలలు ఎగిసి పడతాయని, తుపాను తీరం దాటే సమయంలో కడలూరు, నాగపట్నం, రామనాథపురం జిల్లాల్లో పెనుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు.

అలల తాకిడి ఎక్కువగా ఉన్నందున జాలర్లు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.