” గణనాథుని ఆశీస్సులు శేరిలింగంపల్లి కి ఎల్లప్పుడూ ఉండాలి – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 03( జనంసాక్షి): ఆదిదేవుడు, సర్వ విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణనాథుని ఆశీస్సులు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని, వారంతా సుఖశాంతులతో వెలసిల్లాలని శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇన్చార్జ్ గజ్జల యోగానంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. హఫీజ్పేట్ డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన గణేష్ మండపంవద్ద శనివారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎలాంటి కష్టాలైనా తొలగిపోవాలంటే, అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే ప్రధమ గణనాథుడు ఆ విగ్నేశ్వరుడేనని, ఆయన ఆశీస్సులు, కరుణ, కటాక్షాలు ప్రజలపై ఉంటే అన్ని కష్టాలు తొలగిపోయి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. భారతదేశంలోని ఎంతో విశిష్టంగా జరుపుకునే వినాయక చవితి పర్వదినం తొమ్మిది రోజులపాటు దేశంలో భక్తి ప్రపత్తులు, ఆధ్యాత్మిక భావనలు కొనసాగి దైవచింతన అలవడుతోందన్నారు. భక్తులంతా గణేష్ నవరాత్రులలో వినాయక మండపాలకు చేరుకొని ప్రత్యేక పూజలు, భజనలు, గణనాధునికి ఇష్టమైన సేవా కార్యక్రమాలను నిర్వహించి తరించాలని గజ్జల కోరారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచంపై తన పంజా విసిరిన కారణంగా పండుగలను జరుపుకోవడం అనివార్యమయిందని, ఈ సంవత్సరం భారతీయులు, హిందువులంతా రెట్టించిన ఉత్సాహంతో ఆదిదేవుని కొలుస్తూ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుండడం శుభ పరిణామం అన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తన చేతుల మీదుగా స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఇందులో భాగంగా మండప నిర్వహకులు గజ్జల యోగానందును శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ రావు, మనోహర్, రవి గౌడ్, జనార్దన్ గౌడ్, జానీ, సంజు గౌడ్, సుబ్బారావు, నాగేశ్వరి, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, బస్తీ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.