గర్భిణులకు తగిన సూచనలు ఇవ్వాలి
ఏలూరు,అక్టోబర్13(జనంసాక్షి): ప్రధాన మంత్రి సురక్షిత మాతా యోజన అన్ని ఆసుపత్రుల్లో అమలయ్యేలా చూడాలని జిల్లా వైద్యాధికారి అన్నారు. లేబర్‌వార్డులనే ఆపరేషన్ థియేటర్‌ల మాదిరిగా తయారు చేయాలన్నారు. గర్భిణులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చినప్పుడు వారికి అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రసవ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే గుర్తించి తగిన సూచనలు,
మందులను అందించాలన్నారు. సాంకేతిక పారిశుద్ధ్య విధానాన్ని అన్ని ఆసుపత్రుల్లో అమలు చేయనున్నామని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని మాస్టర్ మహిళా హెల్త్‌చెకప్ గురించి మహిళలకు అవగాహన కల్పించాలని 30 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళా ఈ చెకప్ చేసుకునేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అన్ని ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను నిర్వహించాలన్నారు. గర్భస్థ లింగ నిర్దారణ చట్టాన్ని అన్ని ఆసుపత్రుల్లో అమలు చేయాలన్నారు.
మాతా శిశు మరణాలు తగ్గించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని, ప్రభుత్వాసుపత్రుల అత్యవసర విభాగాల్లో అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వైద్యసేవలు సరిగా అందటంలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానన్నారు.