గవర్నర్‌ తమిళసైకి మాతృవియోగం


చికిత్స పొందుతూ తల్లి కృష్ణకుమారి మృతి
సంతాపం తెలిపిన ఎపి గవర్నర్‌ బిశ్వభూషణ
సిఎం కెసిఆర్‌ ,మంత్రులు పలువురి సంతాపం
హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తల్లి కృష్ణ కుమారి కన్నుమూశారు. 80 ఏండ్ల వయస్సున్న ఆమె ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని చెన్నైకి తరలించనున్నారు. కృష్ణకుమారి.. మాజీ ఎంపీ కుమారినందన్‌ భార్య, గవర్నర్‌ తమిళిసై ఆమె పెద్ద కూతురు. కాగా, గవర్నర్‌ తమిళిసై తల్లి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాతృమూర్తి కృష్ణకుమారి మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణకుమారి మరణంపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హరీశ్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి తయాకర్‌ రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మధ్యాహ్నం వరకు పార్థివదేహాన్ని రాజ్‌భవన్‌లో ఉంచారు. అనంతరం ఆంత్యక్రియల కోసం చెన్నైకి తరలించనున్నారు. తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మాతృమూర్తి కృష్ణ కుమారి ఆకస్మిక మృతిపట్ల ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ విచారం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, వారి
కుటుంబ సభ్యులకు ఏపీ గవర్నర్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. మాతృమూర్తి వియోగంతో తీవ్ర విషాదంలో ఉన్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. గవర్నర్‌ మాతృమూర్తి కృష్ణకుమారి మృతి పట్ల మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో ఆమె భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్‌ దంపతులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గవర్నర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌ తల్లి కృష్ణకుమారికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నివాళులర్పించారు. తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న గవర్నర్‌కు, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గవర్నర్‌ మాతృమూర్తి కృష్ణకుమారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు దైర్యాన్ని ఇవ్వాలని ఆయన భగవంతుని ప్రార్థించారు.