గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ కిరాతక దాడులు

 

యూదు దురహంకార ఇజ్రాయిల్‌ గాజాపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. బుధవారం జరిపిన దాడిలో హమాస్‌ ముఖ్యనాయకుడు మిలిటరీ కమాండర్‌ అహ్మద్‌ అల్‌జబారి చనిపోయారు. గురువారంనాడు మరో ముగ్గురు పౌరులు ఈ దాడుల్లో చనిపోయారు. ఇజ్రాయిల్‌ దుశ్చర్యతో దిగ్బ్రాంతికి గురైన హమాస్‌ దీనికి ఇజ్రాయిల్‌ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ చర్య ద్వారా పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దురాక్రమణపూరిత యుద్దానికి దిగిందని పేర్కొంది. మరోవైపు ఇజ్రాయిల్‌ పదాతి దళాలను సన్నద్ధం చేస్తోంది. గాజా ఆపరేషన్‌ను విస్తరించడానికి సైన్యం సన్నద్ధంగా ఉండాలని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు కోరారు. ఇజ్రాయిల్‌ నౌకాదళం కూడా గాజాపై దాడికి సన్నద్దమవుతోంది. హమాస్‌ మిలిటరీ కమాండర్‌ జబారిని పాశవికంగా చంపిన ఇజ్రాయిల్‌పై ప్రతీకార దాడులు తప్పవని హమాస్‌ సాయుధ విభాగం హెచ్చరించింది. దక్షిణ ఇజ్రాయిల్‌లోని పట్టణాలు, ప్రాంతాల్లోని ప్రజలను బాంబు షెల్టర్లలోకి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమైంది. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ద నేరాలను నిలువరించాల్సిందిగా పాలస్తీనా ఐరాస పరిశీలకులు చేసిన విజ్ఞప్తిని పరిశీలించింది. గాజా నుంచి రాకెట్‌ దాడులు వచ్చిన తరువాతే ఈ దాడులు చేశామని ఇజ్రాయిల్‌కు ఉందని ఆయన వాదించారు. మండలి దీనిపై ఎటువంటి ప్రకటన చేయకుండానే వాయిదా పడింది. దక్షిణ ఇజ్రాయిల్‌, గాజాల్లో హింసాకాండ పెచ్చరిల్లిందని అక్కడ పరిస్థితి మరింత దిగజారకుండా నిలువరించాల్సిన పరిస్థితి ఉందంటూ ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సికి ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కిమూన్‌ చెప్పారు. ప్రజా ఉద్యమం అనంతరం ఈజిప్టు ప్రభుత్వంతో అంతంతమాత్రంగా ఉన్న ఇజ్రాయిల్‌ సంబంధాలు ఈ ఘర్షణతో మరింత దెబ్బతినే ప్రమాదముంది. హమాస్‌తో ఈజిప్టు తన రాయబారిని ఇజ్రాయిల్‌ నుంచి వెనక్కి పిలిపించింది. ఒబామా ప్రభుత్వం మాత్రం ఇజ్రాయిల్‌ దాడులను నిస్సిగ్గుగా సమర్థించింది.