గిరిజనుల్లో పౌష్టికాహార లోపం

ఇక్రిశాట్‌ సహకారంతో ఆహారం అందచేత

తయారీలో గిరిజన యువతకు శిక్షణ

నిర్మల్‌,నవంబరు 26(జనం సాక్షి): ఏజెన్సీలో అత్యధికంగా పౌష్టికాహార లోపం, రక్తహీనతతో ప్రజలు బాధపడుతున్నారు. గిరిజనులు ఈ పరిస్థితి అధిగమించడానికి వారికి మరింత ప్రోత్సాహం అందిస్తున్నది. గిరిజన సంక్షేమశాఖ ఆదేశాల మేరకు అధికారులు ఉమ్మడి జిల్లాలోని కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో, ఉట్నూర్‌లో పౌష్టికాహార కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇక్రిశాట్‌ సంస్థ తనదైన పరిజ్ఞానంతో ఈ పౌష్టికాహార కేంద్రాలను ఏడాది పాటు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్రిశాట్‌ తయారు చేసిన పౌష్ఠికాహారాన్ని గిరిజన కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (జీసీసీ) ద్వారా ఆశ్రమ, గురుకుల పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయనున్నారు. ప్రైవేటు భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ద్వారానే అందించడం ద్వారా అవక తవకలు జరగకుండా నేరుగా పాఠశాలలు, వసతిగృహాలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు అందనున్నది. పాఠశాలలో చదువుకునే గిరిజన విద్యార్థులు రక్తహీనతతో అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకోసం విద్యార్థుల చదువుపై ప్రభావం పడకుండా ఉండేందుకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి, రక్తహీనత ఏర్పకుండా ఉండడానికి దోహద పడుతుంది. పౌష్టికాహార తయారీ కేంద్రాల్లో ఏర్పాటుతో బలవర్ధకమైన ఆహారం అందించడమే కాకుండా తయారీ కేంద్రంలో పని కల్పించడం ద్వారా గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కలుగనున్నది. అందుకోసం ఐటీడీఏ ద్వారా ఏర్పాటుచేసిన యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ద్వారా గిరిజన యువతీ యువకులకు శిక్షణ అందించి జేఎల్‌జీ గ్రూప్‌ ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏజెన్సీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, కిశోర బాలికలకు, గర్భిణులకు, బాలింతలకు, పౌష్టికాహలోపం గలవారికి అందించనున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రక్త నమూనాలు పరీక్షించినప్పుడు చాలా మందికి రక్తహీనత తక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఐటీడీఏ ప్రాంతంలో పౌష్టికాహార కేంద్రాలు తామే ఏర్పాటు చేసి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకొనున్నారు. దేశంలోనే మొదటి సారిగా ఇక్రిశాట్‌ పరిజ్ఞానంతో అత్యంత పోషక విలువలు కలిగిన పౌష్టికాహార కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. సంవత్సరం పాటు ఇక్రిశాట్‌ సంస్థ పర్యవేక్షణలో పౌష్టికాహార కేంద్ర కొనసాగనున్నది. ఇందుకోసం ఉట్నూర్‌ మండల కేంద్రంలోని పాత కోర్టు భవనానికి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నాణ్యత గల పల్లీలు, బెల్లంతో కూడిన పల్లిపట్టి తయారు చేయనున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ జొన్నలు, కొర్రలు, పెసర, కందితో పాటు ఇతర ఆహార దినుసులతో కలిపి తక్షణమే వండి తినే విధంగా న్యూట్రి బాస్కెట్లను ఇక్రిశాట్‌ సంస్థ వారి సహకారంతో తయారు చేయనున్నారు. ఇప్పటికే సంస్థ సీనియర్‌ అధికారిని ఇక్కడ నియమించారు. ఆయన సలహా మేరకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలను సైతం అందించనున్నట్లు సంస్థ అధికారి పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో కూడా ఏటూరునాగారంలో న్యూట్రి బాస్కెట్‌, భద్రాచలంలో పల్లిపట్టి తయారు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తున్నది. పౌష్టికాహార కేంద్రాల్లో తయారుచేసిన సరుకుల్లో నాణ్యాతా ప్రమాణాలకు పెద్దపీట వేయనున్నారు. ప్రస్తుతం అందిస్తున్న సరుకులు ప్రైవేటు కంపెనీలు ద్వారా అందుతున్నాయి. వాటికి అధిక ధర ఉండడంతో పాటు నాణ్యత కూడా అంతంతగానే ఉండడం కారణంగా ప్రభుత్వం ద్వారానే నేరుగా పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యతతో పాటు తక్కువ ధరకు అందించేందుకు చర్యలు చేపట్టారు.