గిరిజనుల నుంచి..  మనం ఎంతో నేర్చుకోవాలి


– ప్రాచీన పర్యావరణ వారసత్వాన్ని కాపాడుతున్నారు
– గత పాలకులు తప్పుడు పాలన సాగించారు
– 2022 నాటికి అందరికీ గృహ వసతి కల్పిస్తాం
– మధ్య ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ, నవంబర్‌20(జ‌నంసాక్షి) : వాతావరణ మార్పులపై ఎలా పోరాడాలో గిరిజనుల నుంచి నేర్చుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌ శాసన సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరపున ప్రచారం చేశారు. జభువాలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు..  భారతదేశంలోని గిరిజనులు ప్రాచీన పర్యావరణ వారసత్వాన్ని కాపాడుతున్నారని ప్రశంసించారు. సంప్రదాయబద్ధంగా శతాబ్దాల తరబడి పర్యావరణంతో సామరస్యంగా జీవిస్తున్నారన్నారు. వాతావరణ మార్పులతో పోరాడే విధానాన్ని గిరిజనుల నుంచి నేర్చుకోవచ్చునని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ దశాబ్దాలపాటు తప్పుడు పాలన సాగించిందని మోదీ దుయ్యబట్టారు. దేశంలో కూడా ఆ పార్టీ పాలన సక్రమంగా సాగలేదన్నారు. కాంగ్రెస్‌ పాలనలో అవినీతి విస్తరించిందని, రైతుల బాధలు, నిరుద్యోగం, నేరాలు పెరిగాయని ఎండగట్టారు. అలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోవాలని మధ్యప్రదేశ్‌ ప్రజలు అనుకోవడం లేదని తాను గట్టిగా నమ్ముతున్నట్లు తెలిపారు. అనంతరం మోదీ తన నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. తన ప్రభుత్వం ప్రజలందరికీ ప్రయోజనం కలిగేవిధంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తన ప్రభుత్వ కార్యక్రమాలను, చర్యలను సవిూక్షించి, తీర్పు చెప్పవచ్చునని స్పష్టం చేశారు. గ్రామాలకు రోడ్లు, ముద్ర రుణాలు, రైతుల ఆదాయాన్ని 2022 నాటికి
రెట్టింపు చేయడం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2022 నాటికి అందరికీ గృహ వసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సుపరిపాలనకు ఈ పథకాలన్నీ మూల స్తంభాలవంటివని తెలిపారు.