గుంటూరు జిల్లాలో..  పాఠశాల బస్సు బోల్తా


– అదుపు తప్పి కల్వర్టులోకి దూసుకెళ్లిన బస్సు
– నలుగురి విద్యార్థుల పరిస్థితి విషమం, మరికొందరికి స్వల్పగాయాలు
– హుటాహుటీన ఆస్పత్రికి తరలించిన స్థానికులు
గుంటూరు, జనవరి28(జ‌నంసాక్షి) : పాఠశాలకు వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో నలుగురు విద్యార్థులు తీవ్రగాయాలు కాగా, 20 మంది విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వాగు వద్ద సోమవారం ఉదయం జరిగింది. మాచర్లకు చెందిన కృష్ణవేణి టాలెంట్‌ పాఠశాల బస్సు వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన 48 మంది విద్యార్థులతో మాచర్ల వెళ్తోంది. మండాది వాగు వద్ద ఎదురుగా వేరే వాహనం రావడంతో బస్సు డ్రైవర్‌ దానిని తప్పించబోయి పక్కకు తిప్పాడు. దీంతో బస్సు కల్వర్టు విూద నుంచి వాగులోకి పడింది. బస్సులోని 20మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. తమ పిల్లలు ప్రయాణిస్తున్న స్కూల్‌ బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గాయపడిన పిల్లలను తరలించిన ఆస్పత్రికి చేరుకొని.. ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. అంతకుముందు సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడ్డవారికి తనవంతు సాయం అందించారు. ఆస్పత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు. బస్సు కండీషన్‌, డ్రైవర్‌ తీరుపై స్థానికులు, చిన్నారుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆసుపత్రి వద్ద వైద్యులకు బదులు స్వీపర్లు కట్లు కట్టడంతో వైద్యులు చేయాల్సిన పనిని స్వీపర్ల చేత ఎలా చేయిస్తారంటూ విద్యార్థుల బంధువులు వాగ్వాదానికి దిగారు. కాగా ప్రమాద అనంతరం స్కూల్‌ యాజమాన్యం అందుబాటులోకి లేకుండా పోయింది. బస్సు కండీషన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు కండీషన్‌ సరిగాలేకపోయిన విద్యార్థులను తరలించడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.