గుంతలమయంగా రోడ్లు

బాగుచేసి ప్రమాదాలు నివారించాలి

ఏలూరు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన గుంటుపల్లి బౌద్దారామాల క్షేత్రానికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. కామవరపుకోట- చింతలపూడి మార్గంలో ఉన్న ఈ రహదారి అడుగడుగునా గుంతలమయంగా మారడంతో నరకాన్ని తలపిస్తోంది. వర్షాలకు రోడ్డు అంచులు కోతకు గురికావటంతో ఎదురుగా వాహనం వస్తే తప్పుకోవటం కష్టం అవుతోంది. దీంతో తరచూ దిచక్ర వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అటవీ ప్రాంతం కావటంతో రాత్రి సమయంలో ప్రమాకరంగా ఉందని పలువురు చెబుతున్నారు. నిత్యం ఈ రోడ్డులో వందలాది వాహనాలు తిరుగు తుంటాయి. ఇంతటి కీలకమైన మార్గాన్ని అధికారులు అభివృద్ధి చేయాల్సి ఉందని కోరుతున్నారు. ఇదిలావుంటే తూర్పు గోదా వరి జిల్లా కత్తిపూడి నుంచి జిల్లాలోని చించినాడ విూదుగా ఒంగోలు వరకూ విస్తరించనున్న 216 జాతీయ రహదారి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ రహదారి విస్తరణలో భాగంగా ఎన్‌హెచ్‌ అధికారులు కొద్ది నెలల కిందటే ఆక్రమణలను తొలగించడంతో పాటు మండలంలోని చించినాడ నుండి పాలకొల్లు మండలం దిగమర్రు వరకూ సుమారు 10 కిలోవిూటర్లు మేర రోడ్డుకు ఒకవైపు సుమారు మూడు విూటర్ల వెడల్పు వరకూ మట్టిని తొలగించి రోడ్డు మార్జిన్‌కు అక్కడక్కడా ఇసుక బస్తాలను రక్షణగా పెట్టారు. అయితే మట్టిని తొలగించి స్థానే గ్రావెల్‌, మెటల్‌ వేసి నింపాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ పనులను చేపట్టకపోవడంతో ఈ రహదారిపై ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక మంది గాయాలపాలయ్యారు.అయినా సంబంధిత అధికారులకు పట్టడం లేదని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని పలువురు వాహనచోదకులు కోరుతున్నారు.