గుంతల రోడ్లను బాగు చేయాలని సీపీఐ నాయకుల వినూత్న నిరసన..
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 10 : చేర్యాల మండల కేంద్రం నుండి దుద్దేడ క్రాసింగ్ వరకు గుంతలమయమైన రోడ్లను వెంటనే బాగు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం కొత్త బస్టాండ్ వద్ద చెరువును తలపిస్తున్న గుంతల రోడ్లపై వరి నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ.. చేర్యాల ప్రాంతం పరిస్థితి పేరు పెద్ద ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని పట్టించుకోవాల్సిన పాలకులు, అధికారులు చూసి చుడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చేర్యాల మండల కేంద్రం నుండి దుద్దెడ క్రాసింగ్ వరకు రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా మారి కొద్దిపాటి వర్షానికే లోతైన గుంతలతో దర్శనమిస్తున్నాయని, నిత్యం జనగామ, సిద్దిపేట, హుస్నాబాద్ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాలకు నిత్యం వేలాది మంది ప్రజలు, భక్తులు ప్రయాణం చేస్తుంటారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది గుంతల్లో పడి తీవ్ర గాయాలై ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు చెడిపోయి కొన్నేళ్లు గడుస్తున్నా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవాల్సిన స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు, రోడ్డు రవాణా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన పాలకులు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే రోడ్డు మరమ్మతులు చేసి బాగు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సీపీఐ మండల సహాయ కార్యదర్శులు బండారి సిద్ధులు, పొన్నబోయిన మహేందర్, నాయకులు గూడెపు సుదర్శన్, గజ్జల సురేందర్, కొంగరి ప్రతాప్, ఎండి.జాహులాముద్దీన్, ముస్త్యాల శంకరయ్య, కొంగరి ప్రతాప్, జూకంటి చంద్రం, కొల్పుల కిష్టయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.