గుజరాత్‌ నమూనా ప్రజాస్వామ్యం

– కేంద్రంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి చిదంబరం

న్యూఢిల్లీ, నవంబర్‌22(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లో గుజరాత్‌ నమూనా ప్రజాస్వామ్యం కొనసాగిస్తున్నారని

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ట్విటర్‌ వేదికగా కేంద్రంపై ధ్వజమెత్తారు.

జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ ముందుకు రానన్ని రోజులు గవర్నర్‌ శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచారని, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీలు ముందుకొస్తుంటే అసెంబ్లీని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లో వెస్ట్‌ మినిస్టర్‌ పాలన పాతబడిపోయిందని, మిగతా అంశాల మాదిరిగానే పాలనలోనూ గుజరాత్‌ నమూనాను అవలంభించాలని జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్లున్నారని చిదంబరం కేందప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జమ్ముకశ్మీర్‌లో రాత్రికిరాత్రే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర శాసనసభను గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ బుధవారం రాత్రి రద్దు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మద్దతుతో పీడీపీ-కాంగ్రెస్‌ కూటమి సిద్ధమయిన సమయంలో గవర్నర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీడీపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం నుంచి భాజపా వైదొలిగిన నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌ 19 నుంచి 6 నెలల పాటు రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించిన సంగతి తెలిసిందే.