గుట్కా పై నిషేధం ఉత్తిదేనా!?

.

•బయ్యారంలో యదేచ్చగా నిషేధిత గుట్కా వ్యాపారం
బయ్యారం,సెప్టెంబర్5(జనంసాక్షి):
పేరుకే నిషేధం…కానీ అంతా బహిరంగం!బయ్యారం మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా, ఏ కిరాణం చూసినా గుట్కా అమ్మకాలు దర్శనమిస్తున్నాయి.2013లోనే ప్రభుత్వం గుట్కా పై నిషేధం విధించినా అక్రమార్కులు గుట్కాను సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.జనం ప్రాణాలు హరిస్తుందని తెలిసినా వ్యక్తిగత స్వార్థంతో విచ్చలవిడిగా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.పాన్ మసాలా పేరుతో తంబాకు,పాన్ బార్ వంటి అనేక రకాల గుట్కాలను ఇతర ప్రాణాంతక మత్తు పదార్దాలను కలుపుతూ అమ్మకాలు చేస్తున్నారు.పైకి కొన్ని రకాల అనుమతులు ఉన్న పాన్ మసాలాలు కనిపించేలా ఉంచి రహస్యం గా దాచిన నిషేధిత పదార్దాలు గుట్టుచప్పుడు కాకుండా పాన్ డబ్బాలు, బెల్టు షాపులు,కిరాణా దుకాణాలలో బహిరంగంగా వ్యాపారం చేస్తున్నారు.వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని జిల్లా కేంద్రం నుండి రహస్యంగా మండలకేంద్రంలో కొందరు వ్యాపారులు సరఫరా చేస్తున్నారు.నిషేధం విధించక ముందు 5రూపాయల లోపు ఉండే ధర ఇప్పుడు 15 నుండి 20 రూపాయల వరకు పెరిగింది.జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రానికి కొందరు అక్రమ వ్యాపారదారులు సరఫరా చేస్తున్నా అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో తప్పించుకుంటున్నారు.అధికారులు ,పోలీసులు అప్పుడప్పుడు చేసే తనిఖీలకు అలవాటు పడిన అక్రమార్కులు కొందరి అండతో పీడీ యాక్ట్ కింద కేసులు కాకుండా చిన్న చిన్న కేసులు, మండలింపులతో తప్పించుకుంటున్నారు.ఏడాదికో రెండేళ్లకో ఒకసారి అధికారులు నామ మాత్రపు తనిఖీలు నిర్వహించడంతో అడ్డూ అదుపు లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి.ఇటీవలే బయ్యారంలో సంబంధిత అధికారులు తనిఖీ నిర్వహించి కొందరు గుట్కా వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.అయినప్పటికీ సరైన రీతిలో కట్టడిలేకపోవడంతో తిరిగి అదే పందాలో వ్యాపారం నడుస్తుండడంతో వినియోగదారులు ఏటా పెరిగిపోతున్నారు.18 సంవత్సరాలు నిండనివారికి కూడా గుట్కాలు విక్రయించడంతో భావితరం కూడా గుట్కాలకు బానిసలుగా మారుతున్నారు.గుట్కాలు తినడం వల్ల ప్రాణంతక కాన్సర్ మహమ్మారి భారిన పడే అవకాశం ఉందని తెలిసినా లెక్కచేయకుండా మగవారు తినడంతో కుటుంబంలోని భార్య, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గుట్కా మూలంగా కొందరు భర్త ఆరోగ్యం దెబ్బ తినడం కారణంగా ఆర్థిక స్థోమత లేక వైద్యం చేయించుకోలేక ప్రాణ నష్టం జరుగుతున్నా చూస్తూ ఉండాల్సిన పరిస్థితులూ ఉన్నాయి. గుట్కా అమ్మకాల విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అమలు జరిపే విషయంలో వైఫల్యం జరుగుతుందనే చెప్పాలి. ఇప్పటికైనా అధికారులు, పోలీస్ యంత్రాంగం స్పందించి పలు దుకాణాల్లో అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న గుట్కా వ్యాపారులపై, వారికి సరఫరా చేస్తున్న అక్రమార్కులపై పీడీ యాక్ట్ లు నమోదు చేస్తే తప్ప ఈ అడ్డగోలు వ్యాపారానికి అడ్డుకట్ట పడదని స్థానికులు అభిప్రాయపడ్డారు.