గెలుపు గుర్రాలకే టికెట్లు
– 31నుంచి గ్రామాల్లో సభ్యత్వ నమోదు ముమ్మరం చేయండి
– సభ్యత్వాల నమోదు కోటికి చేరాలి
– వచ్చే ఎన్నికల్లో గెలేపే లక్ష్యంగా ముందుకెళ్లండి
– ప్రభుత్వంపై 76శాతం సంతృప్తి ఉంది
– ఎవరిపరిదిలో వారు సమర్ధతను రుజువు చేసుకోవాలి
– త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
– దేశంలో అన్ని వ్యవస్థలను కేంద్రం కుప్పకూలుస్తుంది
– జాతీయ స్థాయిలో మనం క్రియాశీలకం కావాలి
– వీడియోకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, అక్టోబర్24(జనంసాక్షి) : ఏఎన్నిక వచ్చినా గెలుపు టీడీపీదే కావాలని, గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారు. బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ బాధ్యులు, ఇతర నాయకులతో చంద్రబాబు మాట్లాడారు. ఈనెల 31నుంచి గ్రామాల్లో సభ్యత్వ నమోదు ముమ్మరం చేయాలని నేతలను ఆదేశించారు.
ఏపీలో ప్రస్తుతం 64లక్షలు గా ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోటికి చేరుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఎన్నికల్లో గెలిస్తేనే అనుకున్న అభివృద్ధి సాధించగలమన్న ఆయన.. పార్టీలో ప్రతిఒక్కరూ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం కావాలని, గెలిచే అభ్యర్ధులకే టికెట్లు ఇస్తామని తేల్చిచెప్పారు. ఓటర్ల నమోదు కార్యక్రమంపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు. కార్యకర్తలు, పార్టీ వ్యవస్థపై తనకు అంచంచల విశ్వాసం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. బూత్ కన్వీనర్ల నియామకం వెంటనే పూర్తి చేయాలని, శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు చుట్టుముట్టినా పట్టుదలగా అధిగమించామన్నారు. తితలీ తుఫాన్‌తో తీవ్ర నష్టం వాటిల్లిందని అయినప్పటికీ 11 రోజుల్లో సాధారణ పరిస్థితులు తెచ్చామని తెలిపారు. ప్రభుత్వంపై 76 శాతం సంతృప్తి ఉందని పార్టీ నాయకులతో చంద్రబాబు అన్నారు. ఎవరి పరిధిలో వారు తమ సమర్ధతను రుజువు చేసుకోవాలని సూచించారు. గత 4 ఏళ్లలో దేశంలోని అన్ని వ్యవస్థలను కేంద్రం కుప్పకూల్చిందని సీఎం ఆరోపించారు. సీబీఐ సహా అన్ని సంస్థలను గందరగోళం చేసిందని మండిపడ్డారు. ఐటీ దాడులతో భయోత్పాతం సృష్టించి పబ్బం గడుపుకోవాలని భాజపా చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. జాతీయ స్థాయిలో తెలుగుదేశం క్రియాశీలం కావాలని ఆయన ఆకాంక్షించారు. త్వరలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చంద్రబాబు స్పష్టంచేశారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలలో ఓటర్ల నమోదు ముమ్మరంగా సాగాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.