గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణనే ఫస్ట్
పదికోట్ల సంపదను సృష్టిచామన్న మంత్రి తలసాని
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వివరణ
హైదరాబాద్,సెప్టెంబర్27 (జనంసాక్షి) రాష్ట్రంలో గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంపదను సృష్టించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. అలాగే గొర్రెల కాపరులకు ఉపాధి చూపామని అన్నారు. దీంతో వారికి ఆర్థిక భరోసా ఏర్పడిరదన్నారు. గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ ఇండియాలోనే ప్రథమస్థానంలో ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గొర్రెల పంపిణీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో మొదటి దశలో 3, 80,878 గొర్రెల యూనిట్లను పంపినీ చేశాం. రెండో దశలో 3 లక్షల 50వేల గొర్రెల యూనిట్లను ఇవ్వడానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీని నిమిత్తం రూ. 4,780 కోట్ల 44 వేల రూపాయాలు ఖర్చు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 191 లక్షల గొర్రెలు ఉన్నాయన్నారు. కులవృత్తులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉమ్మడి ఏపీలో కులవృత్తులను ఎవరూ పట్టించుకోలేదు. బడుగు, బలహీన వర్గాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ కొత్త కార్యక్రమాలు చేపట్టారు. గొర్రెల పంపిణీతో పాటు వాటికి ఇన్సూరెన్స్ కూడా కల్పించాం. గొల్లకురుమలు ఆర్థికంగా ఎదిగారు. రూ. 10 కోట్ల సంపదను సృష్టించారు. మనం గొర్రెలను పంపిణీ చేసిన తర్వాత ఒక కోటి 30 లక్షల గొర్రె పిల్లలు వచ్చాయి. మూగజీవాలకు మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం.