గొర్రెల పంపిణీ పథకం భేష్‌


ప్రభుత్వానికి ఎన్‌సిడిఎస్‌ బృందం కితాబు
మంత్రి తలసానితో భేటీ అయిన ప్రతినిధులు
హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): తెలంగాణలో యాదవులు, కురుమలు ఆర్ధికంగా పురోగతి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ అద్భుతంగా ఉందని ఎన్‌సిడిసి ప్రతినిధుల బృందం ప్రశంసించింది. కులవృత్తులను ప్రోత్సహించే కార్యక్రమాలు బాగున్నాయని తెలిపింది. మాసాబ్‌ ట్యాంక్‌ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ను కలిసిన ఎన్‌ సి డిసి ప్రతినిధుల బృందం తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు ఆదర్శనీయమని
కితాబునిచ్చింది. కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ప్రతినిధుల బృందానికి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వారికి వివరించారు. గొల్ల, కురుమల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు.గొర్రెల పంపిణీ, అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలోని 7.61 లక్షల మంది గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమాన్నిప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన గొర్రెల కు 1.30 కోట్ల గొర్రె పిల్లలు పుట్టాయి. వీటి విలువ సుమారు 6,500 కోట్ల రూపాయలని మంత్రి వివరించారు.