గోద్రా అల్లర్లలో నేను దోషినైతే నన్ను ఉరితీయండి : నరేంద్రమోడి
అహ్మదాబాద్, జూలై 26 : గోద్రా అల్లర్లలో తాను దోషిగా తేలితే తనను ఉరి తీయండని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఓ ప్రముఖ ఉర్దూ వారప త్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు సాహిద్ సిద్దిఖీ పత్రిక కోసం నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేశారు. నిర్మాత మహేష్ భట్, స్క్రీప్ట్ రైటర్ సలీం ఖాన్‌లతో ముంబైలో ఈ మధ్యాహ్నం భోజన సమయంలో కలిసినప్పుడు నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేయాలనే ఆలోచన తనకు తట్టిందని సిద్దిఖి చెప్పారు. మిత్రులమంతా గుజరాత్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సలీం, భట్ ఏ సమస్యకైనా చర్చలు ముఖ్యమని అన్నారని, మోడీ ఇంటర్వ్యూకు అంగీకరిస్తారని తాను అనుకోలేదని సయీ దునియా సంపాదకుడు సిద్దిఖి అన్నారు. మోడీ ఇంటర్వ్యూతో తమ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌కు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ ఇంటర్వ్యూతో ఎస్పీకి గానీ నేతాజీకి (ములాయంకు)గానీ ఏ విధమైన సంబంధం లేదని, తాను మొదట జర్నలిస్టునని, ఆ తర్వాత పార్టీ సభ్యుడినని ఆయన అన్నారు. సాహిద్ జర్నలిస్టుగా తన విధి నిర్వహించారని, దాన్ని పిఆర్ వ్యవహారంగా చూడడం దురదృష్టకరమని భట్ అన్నారు. గోద్రా అల్లర్ల అనంతరం పరిస్థితిపై కూడా మోడీ సిద్దిఖి ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉర్దూ పత్రికకు మోడీ ఇంటర్వ్యూ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.