గ్రంథాలయ భవన నిర్మాణ స్థలం కోసం వినతి

మంత్రిని కలసి విన్నవించిన సంస్థ చైర్మన్‌
హైదరాబాబాద్‌,అక్టోబర్‌28  (జనంసాక్షి): జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌తో కలిసి నిజామాబాద్‌ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎల్‌ఎంబీ రాజేశ్వర్‌ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రి వేముల నివాసంలో వారు కలిసి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి వేముల ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌ భీంగల్‌లో పాత భవనం స్థలంలో కొత్త భవనం నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
మోర్తాడ్‌ గ్రంథాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రికి తెలుపగా..ఆ పనులను వెంటనే మంజూరు చేసి మొదలుపెట్టాలని మంత్రి ఆదేశించారు. మోర్తాడ్‌లో గ్రంథాలయం చుట్టూ ప్రహరీ గోడ తో పాటు పోటీ పరీక్షల కోసం సమాయత్తమయ్యే యువతి యువకుల కోసం ఒక హాల్‌ నిర్మించాలని మంత్రిని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ శ్రీధర్‌ని కోరారు. జిల్లా గ్రంథాలయం తో పాటు జిల్లా లోని అన్ని గ్రంథాలయాలలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల మెటీరియల్‌ అందుబాటులో ఉంచాలని, దానికి సంబంధించి అదనపు నిధులు సమకూర్చాలని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌కు మంత్రి సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సెక్రటరీ బుగ్గారెడ్డి పాల్గొన్నారు.