గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరితగతిన ఇవ్వాలి…
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్….
జనగామ కలెక్టరేట్ జూలై (జనం సాక్షి):గ్రీన్ యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరితగతిన అందజేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు.సోమవారం అదనపు కలెక్టర్ ఛాంబర్లో గ్రీన్ యాక్షన్ ప్లాన్ పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రీన్ యాక్షన్ ప్లాన్ ను అన్ని శాఖల అధికారులు రూపొందించి ఇవ్వాలన్నారు. వివిధ శాఖల అధికారులు స్థలాన్ని, అవసరాలను, ఆయా ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఎన్ని మొక్కలు అవసరం, ఏ ఏ మొక్కలు అవసరం అన్నది కూడా గుర్తించి నివేదికఇవ్వగలిగితే అందుకు అనుగుణంగా మొక్కలను నర్సరీలలో పెంచనున్నామని అన్నారు. ఎత్తైన మొక్కలను కూడా నర్సరీలలో పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, అందుబాటులో లేని మొక్కలను గ్రామపంచాయతీ గ్రీన్ బడ్జెట్ ద్వారా ప్రస్తుతం కొనుగోలు చేస్తూ, రాబోవు కాలానికి సరిపడే మొక్కలను నర్సరీలలో పెంచనున్నామన్నారు.పాఠశాలలో పూలు, పండ్ల చెట్లు, రోడ్ల వెంట ఎత్తైన చెట్లు, మైన్స్ లలో మలబారు వేప, యుకలిఫ్టస్, ఎక్సైజ్ శాఖ ఈత, ఖర్జురా, ఇంటింటికి కావలసిన చెట్ల వివరాలను సేకరించి పటిష్టమైన నివేదిక రూపొందించి ఇవ్వాలన్నారు. కావాల్సిన మొక్కల నివేదిక ప్రకారంగా నర్సరీలలో మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ను, గ్రామపంచాయతీ లలో నర్సరీల సామర్ధ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.ఈ సమావేశంలో జడ్పి సి.ఈ.ఓ.విజయలక్ష్మి, డి.ఆర్.డి.ఓ.రాంరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.