గ్రేడింగ్ లేక నష్టపోతున్న పత్తిరైతు
కర్నూలు,నవంబర్ 22: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని కాటన్ యార్డులో పత్తిని గ్రేడింగ్ చేసే ల్యాబరేటరీలో యంత్రాలు తుప్పుపట్టి పోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రేడింగ్ ల్యాబలేటరీలోని యంత్రాలన్నీ నిరుపయోగంగా మారాయి.ఆదోని యార్డులో రైతులు తెచ్చే పత్తి నాణ్యమైనదని విదేశాలకు కూడా ఎ గుమతులు చేస్తారు. కానీ టీఎంసీ యూనిట్ ఏర్పడినప్పుడు కొద్ది రోజులు మాత్రమే పత్తియొక్క నాణ్యత, తేమ శాతం, గింజల బరువును చూసి గ్రే డింగ్ చేసిన తరువాతనే వ్యాపారాలు సాగేవి. ఇప్పుడు గ్రేడింగ్ చేయకపోవడం వల్ల రైతులు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తోంది. రాష్ట్రంతో పాటు- పొరుగునే ఉన్న కర్ణాటకకు చెందిన పంట ఉత్పత్తుల విక్రయాలు.. ఏటా రూ.400 కోట్ల లావాదేవీలు.. అయినా రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించే ఓ పనికి రూ.40 వేలు, ఎనిమిది మంది సిబ్బందిని కేటాయించలేకపోతున్నారు. ఆదోని మార్కెట్‌యార్డులో పత్తిని గ్రేడింగ్ చేసే యంత్రాలు తుప్పుపట్టి మూలనపడినా పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. దీనివల్ల గ్రేడింగ్ విషయంలో పత్తి రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. కొందరు వ్యాపారుల వత్తిళ్లకు తలొగ్గి అధికారులు వీటికి మరమ్మతు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మార్కెటింగ్ శాఖలో గ్రేడింగ్ సెక్షన్ సూపర్‌వైజర్లను నియమించి వారి ఆ ధ్వర్యంలో పత్తి నాణ్యతను రైతులకు వివరించాలి. కానీ మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం వల్ల గ్రేడింగ్ సెక్ష న్ ఉద్యోగులను జిల్లా కేంద్రాలకే పరిమితమవుతున్నారు. కొత్త గ్రేడర్స్‌ను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యహరించడంతో రైతులు పత్తి నాణ్యతను తెలుసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే క్వింటానికి ఒక రూపాయి తగ్గినా వ్యాపారిని నిలదీసే హక్కు ఉంటుంది. కానీ పత్తి ఆరబెట్టి మంచి నాణ్యతతో తీసుకొస్తున్నా వ్యాపారులు నట్టేట ముంచుతారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



