ఘనంగా సత్యసాయి యూనివర్శిటీ స్నాతకోత్సవం
పుట్టపర్తి: పుట్టపర్తిలోని సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 31వ స్నాతకోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్ హాల్‌లో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత అణుశక్తి సంస్థ మాజీ ఛైర్మన్ అనిల్ కకోద్కర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా విలువలతో కూడిన విద్య అభ్యసించినపుడే దానికి సార్ధకత వస్తుందని అన్నారు. విద్యారంగంలో సాంకేతిక పరంగా మారుతున్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని సద్వియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మనం నేర్చుకున్న విద్య దేశానికి ఉపయోగపడేలా ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సత్యసాయి విద్యాసంస్థలు ఆదర్శంగా నిలుస్తాయని కితాబిచ్చారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 22 మంది విద్యార్థులకు ఆయన బంగారు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు సభ్యులు, సేవా సమితి ప్రతినిధులు పాల్గోన్నారు.



