చంద్రబాబుకు నా ఇబ్బందులను వివరించాం

– అన్నింటిని పరిష్కరిస్తానని హావిూ ఇచ్చారు

– కార్యకర్తలతో సమావేశమైన తుదినిర్ణయం తీసుకుంటా

– చంద్రబాబుతో భేటీ అనంతరం ఆమంచి కృష్ణమోహన్‌

అమరావతి, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : తెదేపా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు తనకు నియోజకవర్గంలో ఎదురవుతున్న ఇబ్బందులన్నింటిని వివరించానని, వాటన్నింటిని పరిష్కరిస్తానని సీఎం హావిూ ఇచ్చారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. గురువారం సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. సుమారు అర్థగంటపాటు భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు.. పార్టీలో ఉంటానా లేదా అన్నది సమస్య కాదని, కార్యకర్తలతో మాట్లాడాకే స్పష్టత ఇస్తానన్నారు. ‘నేను కాంట్రాక్టులు అడగలేదని, ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదన్నారు. సీఎం వద్ద తన ఇబ్బందులను తెలియజేశానని, అన్నింటినీ పరిష్కరిస్తానని హావిూ ఇచ్చారన్నారు. అంతర్గతంగా మాట్లాడుకున్నవి.. ఇక్కడ చెప్పలేనని, పరిస్థితుల గురించి వివరించానన్నారు. ఆయన చాలా బాగా మాట్లాడారని, నాకు వ్యక్తిగత ఎజెండాలు ఏవిూ లేవన్నారు. సీఎం నుంచి స్పష్టమైన హావిూ వచ్చిందన్నారు. అయితే తాను సిస్టమ్‌లో ఇమడలేకపోతున్నానన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదన్నారు. ‘చివరి వరకు ఉంటే వాళ్లను చెడగొట్టినవాళ్లమవుతామేమో.. అంతా బాగున్నప్పుడే బయటకు వచ్చేస్తే బాగుంటుందని, వాళ్లకు కూడా మంచిదే కదా అని అన్నారు. కార్యకర్తలతో మాట్లాడి వివరాలన్నీ చెబుతానని అక్కడి నుండి వెళ్లిపోయారు. గత రెండు రోజులుగా ఆమంచి పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. వీటికి బలం చేకూర్చుతూ మంగళ, బుధ వారాల్లో ఆయన నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈమేరకు వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఒకానొక సమయంలో వార్తలు వెలువడ్డాయి. జగన్‌తోనూ భేటీ అవుతున్నారని ఆయన అనుచరులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కృష్ణమోహన్‌తో భేటీ అయ్యారు. ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకుందామని, పార్టీ మారవద్దని చంద్రబాబు మాటగా తెలిపారు. చంద్రబాబుసైతం తనతో భేటీ కావాలని ఆమంచికి సూచించారు. దీంతో బుధవారం భేటీ కావాల్సిన ఉన్నా ఆమంచి వేరే ప్రాంతంలో ఉండటంతో గురువారం మధ్యాహ్నం అసెంబ్లీలోని చంద్రబాబు చాంబర్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చంద్రబాబుతో ఆమంచి చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సైతం నీకు నేనున్నానంటూ హావిూ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆమంచి మరి పార్టీ మారుతారా..? తెదేపాలోనే కొనసాగుతారా అనేది ఇంకా తేలని అంశంగా మిగిలిపోయింది. మరోమారు కార్యకర్తలతో భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. కాగా వైసీపీలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు యలమంచలి అనుచరులు పేర్కొంటున్నారు.