చంద్రబాబుతో ప్రయాణం కష్టం

దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సి ఉంది

ఉత్తరాది పెత్తనం పోవాలి

ఎపి విభజనకు కాంగ్రెస్‌, బిజెపిలు కారణం

ఎపిలో తాను సిఎం కావాలని కోరుకుంటున్నా

చెన్నైలో విూడియాతో పవన్‌ కళ్యాణ్‌

చెన్నై,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ విభజనకు కాంగ్రెస్‌, భాజపాలే కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ధ్వజమెత్తారు. బుధవారం చెన్నైలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఏపీ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. చెన్నైలో ఉన్నప్పుడు నాకెప్పుడు అలాంటి భావన కలగలేదు. విభజనవల్ల నష్టపోయిన ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఆశలతో 2014లో ఏపీలో చంద్రబాబును సమర్థించా. కానీ మొత్తం తారుమారు అయింది. టీడీపీ పీకల్లోతు అవినీతిలో కూరుపోయింది. ప్రాజెక్టుల నుంచి ప్రతి చోట అవినీతి తాండవిస్తోంది. ఇలాంటి పరిస్థితిని ఏపీని బాధిస్తోందన్నారు. చంద్రబాబు గొప్పవారంటూనే.. ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు విషయంలో కాసింత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఆయన ఎప్పుడు స్నేహితుడుగా ఉంటారో.. ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో చెప్పడం కష్టమని.. ఆయనతో ప్రయాణం ప్రమాదకరమన్నారు. టీడీపీ నుంచి ఏవిూ ఆశించకుండా.. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే ఆశిస్తే.. జరిగింది శూన్యమన్నారు. మహాకూటమి ఏర్పాటులో చంద్రబాబు ప్రయత్నాలు సత్ఫలితాలు అందివ్వవన్న పవన్‌.. జాతీయ

రాజకీయాల్లో మూడో కూటమి అవసరమని కుండబద్ధలు కొట్టారు. ప్రత్యేక ¬దా ఇస్తామని భాజపా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. అందుకే రాజకీయంలో మార్పు రావాలి. దేశాలు, రాష్ట్రాలు తిరుగుతూ నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ప్రముఖులను మేధావులను కలిశా. నేను ఇప్పుడు తమిళనాడుకు రావడానికి కూడా కారణం ఉంది. తమిళనాడుకు జనసేనను పరిచయం చేద్దామని వచ్చా. ‘నా పేరు పవన్‌కల్యాణ్‌.. ఇది జనసేన’ ఇక్కడ నేను పలువురు తమిళ రాజకీయ నేతలను కలుస్తా. భాజపా, కాంగ్రెస్‌, తెదేపా వంటి పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాయి. అందుకే నిజమైన పార్టీల అవసరం ఇప్పుడు ఏర్పడింది. జల్లికట్టు కోసం విూరు పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం. యువత ముందుకు వస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలరో జల్లికట్టు నిరూపించిందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లు భారతీయ రాజకీయ వ్యవస్థను శాసిస్తున్నాయి. ఎవరు దేశాన్ని పాలించాలో ఆ రాష్టాల్ర వారే నిర్ణయిస్తున్నారు. దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్టాల్రు కీలక పాత్ర పోషించాలి. రాజకీయాల్లో జవాబుదారీ తనం పెరగాలి. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవినీతి పేరుకుపోయింది. అది వైట్‌కాలర్‌ అవినీతి. ప్రతి నియోజకవర్గంలో రూ.వెయ్యికోట్లపైనే అవినీతి జరిగింది. విభజన రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ గారూ విూకు నేను విన్నవించేది ఒక్కటే. దయ చేసి విూరు ఇచ్చిన మాటకు కట్టుబడండి. జవాబుదారీతనంతో ఉండండని అన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. మా పార్టీ స్టాండ్‌ ఎటువైపు తీసుకుంటోందో త్వరలోనే చెబుతా. నేను కూడా అందరినీ కలుస్తానేమో. చంద్రబాబు రిటైర్‌మెంట్‌ తీసుకునే సమయం దగ్గర పడింది. ఆయన తనయుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేడు. అలాంటిది పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో తెదేపా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ జనసేనదే అన్నారు.

నిబద్ధత, సహనం ఉన్న ఏ నటుడైనా రాజకీయాల్లోకి రావచ్చు. 2014లో జనసేన పార్టీని భాజపాలో విలీనం చేయమని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో నేను అలా చేయనని చెప్పా. ఎందుకంటే వారు బాధ్యత కలిగిన వారు కాదు. జవాబుదారీతనం కూడా లేదు. నేను ఎప్పటికీ భాజపా స్నేహితుడిని కాదు. నా అన్నయ్యకే వ్యతిరేకంగా వెళ్లినవాడిని.. అలాంటిది మోదీ కనీసం నా సోదరుడు కూడా కాదు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే వెళ్తాం. త్రిముఖ పోరు తప్పదన్నారు. 2019లో నన్ను నేను ముఖ్యమంత్రిగా చూసుకోవాలనుకుంటున్నా..ఏ పార్టీ నన్ను కొనలేదు. ఏ ఒక్క లీడరూ నన్ను ప్రభావితం చేయలేడు. ప్రజల కోసమే నేను ఇక్కడకు వచ్చా. మేము కులాలకు వ్యతిరేకం. మా పార్టీ సిద్దాంతాల్లో అదీ ఒకటి. చివరి వరకూ మేము దీన్నే నమ్ముతాం. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది. దక్షిణాదిలో మరింత మంది నీతిమంతమైన రాజకీయ నాయకులు రావాలి. ఉదాహరణకు జగన్‌ను తీసుకుంటే, ఆయనపై ఉన్న కేసుల కారణంగా కనీసం దానిపై మాట్లాడే ధైర్యం కూడా జగన్‌ చేయలేరు. 2019 తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా అని అన్నారు.