చంద్రబాబు, జగన్‌, మోదీలు.. ఏనాడైనా వ్యవసాయం చేశారా?

– ప్రాంతీయ పార్టీలతో ఏపీ న్యాయం జరగదు
శ్రీకాకుళం, మార్చి4(జ‌నంసాక్షి) : ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌ లు ఎన్నికల సమయం వచ్చే సరికి రైతుల జపం చేస్తున్నారని, అసలు వీరు ఎప్పుడైన వ్యవసాయం చేశారా అని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ‘ప్రత్యేక¬దా భరోసా యాత్ర’ ముగింపు సందర్భంగా రఘువీరారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ప్రాంతీయ పార్టీలతో ఏపీకి న్యాయం జరగదని రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక¬దా కోసం పోరాడింది.. తెచ్చేది కూడా కాంగ్రెస్‌ పార్టీనేనని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మోదీని ఓడించి పకోడీలు అమ్ముకునేలా చేయాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ ఉచ్చులో పడిపోయిన చంద్రబాబు ఏపీ అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అపార పాలనానుభవం ఉన్న చంద్రబాబుకు 55 నెలల తర్వాత అయినా జ్ఞానోదయమయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ ప్రధాని అయితేనే ఏపీకి ప్రత్యేక¬దా సాధ్యమని చంద్రబాబు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీకి ఓవైపు అన్యాయం జరుగుతుంటే ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రం బీజేపీనే నమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయకుంటే మరోసారి ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు రాబోమని స్పష్టం చేశారు. రైతులకు ఆర్థిక సాయం పేరుతో రూ.2 వేలు, రూ.6 వేలు, రూ.12 వేలు బిక్షగా వేస్తామంటున్న మోదీ, చంద్రబాబు, జగన్‌ ఏనాడైనా వ్యవసాయం చేశారా అని ప్రశ్నించారు. త్వరలోనే కాంగ్రెస్‌ శ్రేణులు ఏపీలోని అన్ని గ్రామాల్లో భరోసా యాత్రను చేపడతాయని ప్రకటించారు.