చర్చించకుండానే కమిషనర్ సొంత నిర్ణయం

కోదాడ మున్సిపాలిటీలో ప్రోటోకాల్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. గత కొంతకాలంగా మున్సిపాలిటీ కమిషనర్ చైర్పర్సన్ కు సరైన గౌరవం ఇవ్వకపోవడం ,చైర్ పర్సన్ కు మున్సిపాలిటీ పరిధిలో జరిగేటటువంటి పనుల గురించి చర్చించకుండా నేరుగా నిర్ణయాలు ప్రకటిస్తూ ఉండడంతో వీరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది.నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకే కమిషనర్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చైర్పర్సన్ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ అటువంటి వివాదమే మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. కోదాడ మున్సిపల్ పరిధిలో వార్డులలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం గత జులై 15 వ తారీఖున కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దాదాపు 10 కోట్ల మేరకు అభివృద్ధి పనులకు నిర్ణయం తీసుకున్నారు.మీటింగ్ గడిచి దాదాపు 5 నెలలు పూర్తయిన తర్వాత ఇప్పుడు హుటాహుటిన వార్డులలో పనులకు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. అయితే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణకు ఆహ్వానం లేకుండా, కనీసం కార్యక్రమం ఏ సమయంలో ఎప్పుడు నిర్ణయించాలో అనేది చర్చించకుండా,ఆమె పేరు హోదా  లేకుండానే మున్సిపల్ కమిషనర్ ఆహ్వానం పలకడంతో వివాదం ముదిరింది. మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ కు కనీస మర్యాద ఇవ్వకపోవడం, ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడంపై ఖండిస్తూ నేరుగా మునిసిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ మున్సిపల్ కమిషనర్  తీరును తీవ్రంగా ఖండిస్తున్నామంటూ పత్రిక ప్రకటనను విడుదల చేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.