చిక్కుల్లో డిగ్గీరాజా

మావోలతో బంధంపై ప్రశ్నించనున్న పుణె పోలీసులు

ముంబై,నవంబర్‌19(జ‌నంసాక్షి):కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డారు. మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న కేసులో పుణె పోలీసులు డిగ్గీ రాజాను ప్రశ్నించనున్నారు. దీంతో కాంగ్రెస్‌ సమాధానం ఏంచెబుతుందో అన్న ఉత్కంఠ ఉంది. ఈ మధ్య మావోయిస్టుల దగ్గర బయటపడిన లేఖలో దొరికిన ఫోన్‌ నంబర్‌ దిగ్విజయ్‌దేనని పోలీసులు నిర్దారించారు. దిగ్విజయ్‌ను స్నేహితుడిగా చెబుతూ ఆయన ఫోన్‌ నంబర్‌ను ఆ లేఖలో మావోయిస్టులు రాయడం విశేషం. పుణె డీసీపీ సుహాస్‌ భావ్చె కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ కేసులో ఇంకా చాలా వరకు విచారణ

పూర్తి కాలేదని పోలీసులు చెప్పారు. ఇప్పుడు దిగ్విజయ్‌ను కూడా పిలిచి విచారిస్తామని వాళ్లు స్పష్టం చేశారు. విద్యార్థుల ద్వారా దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించడంలో తమకు సహకరించడానికి కాంగ్రెస్‌ నేతలు సిద్ధంగా ఉన్నట్లు కమాండర్‌ సురేంద్రకు రాసిన లేఖలో కమాండర్‌ ప్రకాశ్‌ వెల్లడించాడు.

మావోయిస్టు నేతలతో ఈ మధ్య అరెస్టయిన సామాజిక కార్యకర్తలకు కూడా సంబంధాల ఉన్నట్లు నిరూపించడంలో భాగంగా ఈ లేఖను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇప్పుడు మావోయిస్టుల లేఖలోని ఫోన్‌ నంబర్‌ దిగ్విజయ్‌దేనని తేలడంతో ఎన్నికల ముందు ఆయనపై తన దాడిని మరింత పెంచారు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌. అయితే తాను మాత్రం అమాయకుడినని, దమ్ముంటే తనను అరెస్ట్‌ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిగ్విజయ్‌ సవాలు విసరడం విశేషం.