చిదంబరానికి సుప్రీంలో ఊరట
2-జీలో కుట్ర లేదన్న కోర్టు
హోంమంత్రి పాత్రపై ఆధారాలు లేవన్న న్యాయస్థానం
న్యూఢిల్లీ, ఆగస్టు 24 : 2జి స్కామ్ కేసులో కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరానికి ఊరట లభించింది. 2జి స్కామ్‌లో చిదంబరం పాత్రపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. మార్కెట్ రేట్లకు తక్కువగా 2జి స్పెక్టమ్ కేటాయింపులు జరపడంలో చిదంబరం పాత్రం ఉందని ఆరోపిస్తూ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఓ ఎన్జీవో వేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని న్యాయమూర్తులు జిఎస్ సింఘ్వీ, కెఎస్ రాధాకృష్ణన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. చిదంబరం విషయానికి వస్తే క్రిమినల్ కుట్ర జరగిందని చెప్పడానికి ఆధారాలు లేవని స్పష్టంచేసింది.
2జి కుంభకోణంలో చిదంబరం క్రిమినల్ కుట్రకు పాల్పడలేదని, అందువల్ల కేసులో చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాల్సిన అవసరం లేదని ట్రయల్ కోర్టు ఇంతకు ముందు స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టుకు వెళ్లారు.
ఎ రాజా టెలికమ్ మంత్రిగా ఉన్నప్పుడు 2008లో టెలికమ్ కంపెనీలకు స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపినప్పుడు చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారి చెబుతూ అందువల్ల చిదంబరం పాత్రపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని ఎన్జీవో వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.