చుక్కల భూములకు పరిష్కారం చూపండి

– సరళమైన విధానాలతో పరిష్కరించాలి
– 40,040 కొత్త రేషన్‌, స్ల్పిట్‌ కార్డులకు ఆమోదం లభించింది
– ఫిబ్రవరి మొదటివారంలో 4లక్షల ఇళ్ల గృహప్రవేశాలు
– కలెక్టర్‌ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి28(జ‌నంసాక్షి) : గుంటూరు జిల్లాలో చుక్కల భూముల పరిష్కారం జరిగిందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడి అధికారులు చుక్కల భూముల వివాదానికి స్వస్తి పలికారని, అక్కడి విధానాన్ని అనుసరించి మిగిలిన జిల్లాల్లోని కలెక్టర్‌లు విూవిూ జిల్లాల్లో చుక్కల భూముల సమస్యలను పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్‌లను దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టర్‌లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. చుక్కల భూముల విషయంలో అధికారులు పుస్తక పరిజ్ఞానాన్ని అనుసరించడం వల్లే ఇన్నాళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోలేదని బాబు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లాలో 28 వేల మందికి పరిష్కారం చేశామని, 10వేల ఇళ్ల స్థలాలు అందిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్‌ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గుంటూరు జిల్లా కలెక్టర్‌ అనుసరించిన విధానాన్నే మిగిలిన జిల్లాల కలెక్టర్లూ అనుసరించాలని సీఎం దిశా నిర్దేశంచేశారు. సాంకేతిక సమస్యలతో లేనిపోని ఇబ్బందుల్ని సృష్టించకుండా సరళమైన విధానాలతో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. కృష్ణా జిల్లాలో చుక్కల భూముల సమస్య లేదని, జిల్లాలో అనుసరించిన డిజిటలైజేషన్‌ విధానాల్ని అసోం సచివాలయంలో అమలు చేస్తున్నారని సీఎం గుర్తుచేశారు. కొత్త రేషన్‌ కార్డులు, స్ల్పిట్‌ కార్డుల కోసం 55,540 దరఖాస్తులు రాగా, అందులో40,040 దరఖాస్తులకు ఆమోదం లభించినట్లు కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. 7,024 దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, 8,476 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు సీఎం తెలిపారు. 10,033 కొత్త రేషన్‌కార్డులు అందజేయగా, 5,196 స్ల్పిట్‌ రేషన్‌
కార్డులు అందిచినట్లు చెప్పారు. 24,811 దరఖాస్తులకు త్వరలో రేషన్‌ కార్డులు సిద్ధమయ్యాయన్నారు. ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో ఒకరోజు 4 లక్షల ఇళ్లల్లో గృహప్రవేశం చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆర్టీజీ డేటాలో ఇంకా పర్‌ఫెక్షన్‌ రావాలన్నారు. ల్యాండ్‌ హబ్‌, సీఎంఎఫ్‌ఎస్‌ వ్యవస్థలు మెరుగుపడ్డాయని సీఎం చెప్పారు. ఆర్టీజీకి, ఆయాశాఖల క్షేత్రస్థాయి పరిశీలనకు అనుసంధానం ఉండట్లేదని, ఆర్టీజీ సమాచార ఆధునికీకరణలో వెనుకబడుతోందని ఆయన పేర్కొన్నారు. వచ్చేనెల 2 లోపు పెన్షన్‌ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌లోని టాయిలెట్స్‌ దరఖాస్తులను పరిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా లిమ్కా బుక్‌లో చోటు దక్కించుకోవడం సంతోషమని, ఇన్నోవేషన్స్‌లో మనం నెంబర్‌ వన్‌ కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. చంద్రబాబు వేసవిలో తాగునీటి సరఫరాపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలని కలెక్టర్‌లకు సూచించారు.