చెదురుమదరు ఘటనలు మినహా..  ప్రశాంతంగా ఛత్తీస్‌గఢ్‌ తొలి విడత పోలింగ్‌

– 18నియోజకవర్గాల్లో సాగిన పోలింగ్‌
– 10 నియోజకవర్గాల్లో 3గంటలకే ముగిసిన పోలింగ్‌
– 47.18శాతం పోలింగ్‌ నమోదు
– సుక్మా జిల్లా కొంటాలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఐఈడీని గుర్తించిన భద్రతా బలగాలు
– ఓ చెట్టు కిందనే పోలింగ్‌ నిర్వహణ
– పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసిన భదత్రాబలగాలు
రాయ్‌పూర్‌, నవంబర్‌12(జ‌నంసాక్షి) : మావోయిస్టుల హెచ్చరికలున్నా.. ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలు ఓటెయ్యడానికి పోటెత్తారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నానికి ఊపందుకుంది. తొలి దశ పోలింగ్‌ జరుగుతున్న 18 నియోజకవర్గాల్లో జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ సాగింది. 18 నియోజకవర్గాలకు గాను 10 సమస్యాత్మక నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3గంటలకే పోలింగ్‌ను ముగించారు. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసే సమయానికి సమయానికి 47.18 శాతం పోలింగ్‌ నమోదైంది. కాగా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది.  ఛత్తీస్‌గఢ్‌లోని 90 స్థానాలకు గాను తొలి దశలో భాగంగా సోమవారం  18 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగింది. తొలి దశ పోలింగ్‌ జరుగుతున్న నియోజకవర్గాలన్నీ దాదాపుగా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలే. దీంతో పూర్తి నిఘా నీడలో ఓటింగ్‌ జరుగుతోంది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 50 డ్రోన్లు, 17 హెలికాప్టర్లు, 1000 శాటిలైట్‌ ట్రాకర్స్‌తో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కోసం 500 కంపెనీల బలగాలతో గస్తీ నిర్వహించారు. అయినప్పటికీ పలుచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
దంతెవాడలో పేలిన మందుపాతర..
దంతెవాడలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పోలింగ్‌ కేంద్రానికి కిలోవిూటరు దూరంలోనే పేలుడు సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సుక్మా జిల్లాలోని కొంటాలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఐఈడీని గుర్తించిన భద్రతా బలగాలు దాన్ని నిర్వీర్యం చేశాయి. అనంతరం అక్కడ ఉన్న ఓ చెట్టు కింద పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బీజాపూర్‌లో ఓ పక్క పోలింగ్‌ కొనసాగుతుండగానే.. మరో పక్క అనుమానిత నక్సలైట్లు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసొల్యూట్‌ యాక్షన్‌ (కోబ్రా)కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు ఆదివారం ఐఈడీ పేల్చడంతో ఓ ఎస్సై మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
సిరా చుక్క కనిపిస్తే.. వేలు కట్‌ చేస్తాం..
దంతెవాడ జిల్లాలోని మాదేండ గ్రామ ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనరాదని మావోయిస్టులు హెచ్చరించారు. చేతి వేలిపై సిరా చుక్క కనిపిస్తే వారి వేళ్లను కట్‌ చేస్తామని హెచ్చరించినట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ మాదేండ పోలింగ్‌ బూత్‌లో 263 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండే మాన్‌పూర్‌లోని పర్దోని గ్రామంలో ప్రజలు ఓటు వేసేందుకు అధిక సంఖ్యలో తరలిరావడం విశేషం. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ప్రజలు ఓటింగ్‌కు ధైర్యంగా ముందుకొంచారు. వద్ధులను పోలింగ్‌ కేంద్రాలకు తరలించిన పోలీసులు ఓటు వేయించారు.