చేతులెత్తేశారు!

– నాలుగో వన్డేలో ఓటమిపాలైన టీమిండియా
– 8వికెట్ల తేడాతో కివీస్‌ ఘనవిజయం
– కివీస్‌ బౌలర్ల ధాటికి 98 పరుగులకే కుప్పకూలిన భారత్‌
¬మిల్టన్‌, జనవరి31(జ‌నంసాక్షి) : న్యూజిలాండ్‌ గడ్డపై రెండు రోజుల క్రితం వన్డే సిరీస్‌ గెలిచి కాలరెగరేసిన భారత్‌కి గురువారం ఊహించని పరాభవం ఎదురైంది. హామిల్టన్‌ వేదికగా గురువారం జరిగిన నాలుగో వన్డేలో ట్రెంట్‌ బౌల్ట్‌ (5/21), గ్రాండ్‌¬మ్‌ (3/26) ధాటికి భారత్‌ బ్యాట్స్‌మెన్‌ 92పరుగులకే చేతులెత్తేశారు. అనంతరం రాస్‌ టేలర్‌ (37), హెన్రీ నికోలస్‌ (30 నాటౌట్‌) దూకుడుగా ఆడటంతో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. తాజాగా విజయంతో న్యూజిలాండ్‌ ఎట్టకేలకి భారత్‌ ఆధిక్యాన్ని 1-3కి తగ్గించింది. టాస్‌ గెలిచిన కివీస్‌ తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోనీ లేని టీమిండియాను కివీస్‌ బౌలర్లు ఆటాడుకున్నారు. ఎంతలా అంటే టీమ్‌లో ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవగా.. ఇందులో ఇద్దరు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌ రూపంలో వెనుదిరగడం కొసమెరుపు. ఆఖర్లో కాసేపు బ్యాట్‌ ఝళిపించిన చాహల్‌ (18 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. తొడ కండరాల గాయం కారణంగా మహేంద్రసింగ్‌ ధోనీ ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు. తొలి పవర్‌ప్లేలోనే కెప్టెన్‌ నమ్మకాన్నినిలబెడుతూ ట్రెంట్‌ బౌల్ట్‌ వరుస ఓవర్లలో భారత్‌ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (13), రోహిత్‌ శర్మ (7) వికెట్లను పడగొట్టాడు. దీంతో.. ఒత్తిడికి గురైన అంబటి రాయుడు (0), దినేశ్‌ కార్తీక్‌ (0) ఒకే ఓవర్‌లో గ్రాండ్‌¬మ్‌కి వికెట్లు సమర్పించుకోగా.. కోహ్లీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న అరంగేట్రం బ్యాట్స్‌మెన్‌ శుభమన్‌ గిల్‌ (9) కూడా నిరాశపరిచాడు. ఈ దశలో ఆదుకుంటారని ఆశించిన కేదార్‌ జాదవ్‌ (1), హార్దిక్‌ పాండ్య (16) చేతులెత్తేయగా.. భువనేశ్వర్‌ (1) ఫెయిలయ్యాడు. అయితే.. ఆఖర్లో కుల్దీప్‌ యాదవ్‌ (15), చాహల్‌ జోడీ కాసేపు కివీస్‌ బౌలర్లకి ఎదురునిలిచి వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. కానీ.. జట్టు స్కోరు 80 వద్ద కుల్దీప్‌ వికెట్‌ పడగానే భారత్‌ ఇన్నింగ్స్‌ ఎక్కువ సేపు నిలవలేదు. భారత్‌ నిర్దేశించిన 93పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్‌ 39 పరుగులకే మార్టిన్‌ గప్టిల్‌(14), కేన్‌ విలియమ్సన్‌(11)ల వికెట్లను చేజార్చుకున్నప్పటికీ, నికోలస్‌(30 నాటౌట్‌), రాస్‌ టేలర్‌(37 నాటౌట్‌)లు జట్టుకు ఘన విజయాన్ని అందించారు. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌కు ఇదొక అతి పెద్ద ఊరట విజయం. భారత బౌలర్‌ భువనేశ్వర్‌ మాత్రమే రెండు వికెట్లు సాధించాడు. ఇక సిరీస్‌లో మిగిలిన ఆఖరి వన్డే ఆదివారం ఉదయం 7.30 గంటలకి హామిల్టన్‌ వేదికగా జరగనుంది.
టీమిండియా స్కోరు ‘వంద’ దాటని సందర్భాలు.. 
టీమిండియా గతంలోనూ పలుమార్లు తక్కువ స్కోర్‌కే చేతులెత్తేసింది. వాటిల్లో 2000 సంవత్సరంలో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో టీమిండియా 54 పరుగులకే కుప్పకూలింది. 1981లో ఆస్టేల్రియాతో సిడ్నీ లో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగులకు భారత జట్టు ఆలౌట్‌ అయింది.  కాన్పూర్‌ వేదికగా 1986లో శ్రీలంకతో జరిగిన వన్డేలో టీమిండియా 78 పరుగులకే ఇంటి ముఖం పట్టింది. 1978లో సియాల్‌కోట్‌ స్టేడియంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 79 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2010లో దంబుల్లా వేదికగా జరిగిన న్యూజిలాండ్‌తో జరిగన వన్డేలో టీమిండియా 88 
పరుగులకే ఆలౌటైంది. 2006లో డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారతజట్టు 91 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుతం హామిల్టన్‌ వేదికగా జరిగిన వన్డేలో టీమిండియా 92 పరుగులకే బ్యాట్స్‌మెన్‌ అందరూ పెవిలియన్‌కు చేరుకున్నారు.