చేపమందు ప్రసాదం పంపిణీ షురూ
ప్రారంభించిన మంత్రి తలసాని
నాంపల్లి మైదానానికి పోటెత్తిన ఉబ్బసం వ్యాధిగ్రస్తులు
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి, అధికారులు
ఎగ్జిబిషన్ మైదానం వరకు 133 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
నేటి ఉదయం 9గంటల వరకు పంపిణీ
హైదరాబాద్, జూన్8(జనం సాక్షి) : మృగశిరకార్తెను పురస్కరించుకుని బత్తినగౌడ్ సోదరుల ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. శుక్రవారం రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిచారు. ఈ సందర్భంగా తలసాని చేపమందును స్వీకరించారు. అనంతరం పలువురు చేప ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు చేప ప్రసాదం కోసం వస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ చేపల మందు ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరినాధ్ గౌడ్ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి ప్రభుత్వం పూర్తిసహకారం అందించటం సంతోషంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే ఉదయం నుంచే ఉబ్బసం వ్యాధి గ్రస్తులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ 133 ప్రత్యేక బస్సులను ఎగ్జిబిషన్ మైదానం వరకు నడుపుతుంది. కాగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శుక్రవారం ఉదయం ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు సాగనుంది. గ్రౌండ్‌లో ఏర్పాట్లను మంత్రి తలసాని పర్యవేక్షించారు. ఆయా శాఖల సిబ్బందికి తగు సూచనలు చేశారు. ప్రసాదం కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి తలసాని సూచించారు.



