ఛత్తీస్‌గఢ్‌ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం

రాయ్‌పూర్లో సోనియా, ప్రధాని

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5లక్షల చొప్పున ప్రధాని సహాయ నిధి నుంచి మంజూరు చేయనున్నట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటించారు. గాయపడినవారికి రూ. 50 వేలు ఇస్తామన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయ్‌పూర్‌లో దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికోసం ఏర్పాటుచేసిన సంతాప సభలో పాల్గొన్నారు. పదకొండు గంటలకు రాయ్‌పూర్‌ చేరుకున్న వీరు అక్కడి నుంచి జగదల్‌పూర్‌ వెళ్లి సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం రాయ్‌పూర్‌లో సంతాపసభలో మాట్లాడుతూ మావోయిస్టు ఉగ్రవాదంతో పోరాడడంలో మనం మరింత కఠినంగా, మరింత పట్టుదలగా వ్యవహరించాలని ప్రధాని అన్నారు. వారి ప్రాణాలు వృథాగా పోరాదని, తీవ్రవాదం, హింసలతో జరిపే పోరాటానికి ఈ సంఘటన స్ఫూర్తి కావాలని ప్రధాని పేర్కొన్నారు. ఛత్తీస్‌గాఢ్‌ కాంగ్రెస్‌ నేతల సాహసాన్ని ప్రశంసిస్తున్నానని సోనియాగాంధీ అన్నారు. తర్వాత వారు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు.