ఛత్తీస్‌ఘడ్‌లో బిజెపికి మద్దతు ఇవ్వం: అజిత్‌ జోగి

రాయ్‌పూర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని, బీఎస్‌పీతో కలిసి తాము సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) పార్టీ చీఫ్‌ అజిత్‌ జోగి శనివారంనాడు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ రెండో విడత పోలింగ్‌ సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విూడియాతో జోగి మాట్లాడుతూ ‘బీజేపీకి నేను మద్దతు ఇవ్వడం జరగదు. అలాగని వారి నుంచి కూడా మద్దతు కోరం. రాష్ట్రంలో మా పొత్తు బీఎస్‌పీతోనే. మా కూటమి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని జోగి

తెలిపారు. బీజేపీతో కలిసేది లేదని జోగి చెప్పడం ఇది మొదటిసారి కాదు. తదుపరి ముఖ్యమంత్రిని తానేనంటూ ఈనెల 9న ఆయన పేర్కొన్నారు. ప్రధాని కావడానికి మాయావతి సమర్ధురాలైన నేత అని కూడా అన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు 2000లో తొలి ముఖ్యమంత్రిగా జోగి సేవలందించారు. మాజీ ఐపీఎస్‌ అధికారి అయిన జోగి 1986లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన ఆయన 2016లో పార్టీకి ఉద్వాసన చెప్పి సీజేసీ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. సహజంగా ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఉంటూ వచ్చేది. అయితే ఈసారి బీఎస్‌పీ, జేసీసీ కూటమి కూడా పోటీపడుతుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది. మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు గాను తొలి విడత 18 నియోజకవర్గాల్లో ఇటీవల పోలింగ్‌ జరుగగా, తక్కిన 72 నియోజకవర్గాలకు ఈనెల 20న పోలింగ్‌ జరుగనుంది. డిసెంబర్‌ 11న ఫలితాలు వెల్లడవుతాయి.