జకియా జఫ్రీ అలుపెరగని పోరాటం
` మోదీతో సహా నిందితులను ‘సిట్’కాపాడిరది
` సుప్రీంలో వాదనలు
దిల్లీ,నవంబరు 25(జనంసాక్షి): గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సహా 64 మందికి క్లీన్ చిట్ ఇస్తూ సమర్పించిన సిట్ నివేదికను సవాల్ చేస్తూ ఎహసాన్ జఫ్రీ భార్య జకియా జఫ్రీ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేయడంతో ఆమె 2018లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు రెండు రోజులుగా వాదనలు జరుగుతున్నాయి. సిట్ తరఫున బుధవారం సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రాలో రైలు దహనం మొదలు వరుసగా చోటుచేసుకున్న ఘటనలను వివరించారు. సిట్ తన విధులను సక్రమంగా నిర్వహించలేదన్న జకియా జఫ్రీ ఆరోపణలను తోసిపుచ్చారు. విస్తృతమైన, నిస్పక్షపాతమైన, సమర్థవంతమైన దర్యాప్తు జరిపామని, నిందితులను కాపాడే యత్నం చేయలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సుప్రీంకోర్టుకు తెలిపింది. 275 మంది వ్యక్తులను విచారించామని పేర్కొంది. జకియా జఫ్రీ ఆరోపించిన విధంగా భారీ కుట్ర జరిగిందనే అభిప్రాయానికి రావడానికి తగిన ఆధారాలు లభ్యంకాలేదని వివరించింది. అల్లర్లపై సమర్పించిన తమ నివేదికను సమర్థించుకుంది. 2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్బర్గా సొసైటీలో జరిగిన హింసాత్మక ఘటనలో మృతి చెందిన వారిలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఎహసాన్ జఫ్రీ కూడా ఉన్నారు.