జగన్‌కు పరాభవం తప్పదు
అసలు మహిషాసురుడు జగనే: పరిటాల సునీత
విజయవాడ,అక్టోబర్19(ఆర్‌ఎన్‌ఎ): చంద్రబాబును తీవ్ర పదజాలంతో వైకాపా నేత జగన్ విమర్శించడాన్ని ఏపీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. జగన్‌కు విమర్వించడం తప్ప మరోటి తెలియదన్నారు. జగన్ ఓ రాక్షసుడని.. రాక్షస కృత్యాలు చేయటం.. రాక్షస భాష మాట్లాడటంలో ఆయనకు మించినవారు లేరని సునీత విమర్శించారు. అసలు సిసలు మహిషాసురుడు జగనేనని.. అందుకే 2014 ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు మహిషాసుర మర్దన చేశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో ‘జగనాసురుడు’ని మర్దించేందుకు మహిళలు మరోసారి సిద్దమవుతున్నారని అన్నారు. పవిత్ర విజయదశమి పర్వదినాన జగన్ లాంటి రాక్షసుడి ప్రస్తావన తేవాల్సి వచ్చిందని అన్నారు. ‘పసుపు’-కుంకుమ’ పథకాన్ని హేళన చేయటం వైకాపా అధ్యక్షుడు జగన్ రాక్షసత్వానికి పరాకష్ట అని ఈ పథకం తీరుతెన్నులపై జగన్ చేసిన విమర్శలకు మంత్రి తీవ్రంగా స్పందించారు. డ్వాక్రా పథకాల అమలు తీరుతెన్నులపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని.. జగన్ సిద్దమేనా అని సవాల్ విసిరారు. కోటి మంది డ్వాక్రా మహిళలను జగన్ అవమానించారని మండిపడ్డారు. ‘పసుపు-కుంకుమ’ పథకం తుది విడత నిధులను సైతం విడుదల చేశామని.. మరో పది రోజుల్లో మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో డ్వాక్రా మహిళలకు కేవలం రూ.276 కోట్లు మాత్రమే నిధులిచ్చి.. చంద్రబాబు హయాంలో రూ.11,180 కోట్లు ఇవ్వడాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని మంత్రి దుయ్యబట్టారు. జగన్‌కు అధికార యావ తప్ప ప్రజల గురించి పట్టదన్నారు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో మరోమారు ఘోరంగా పారభవం తప్పదన్నారు.