జగన్‌కు మద్దతుపై మండిపాటు 

బహిరంగ లేఖ రాసిన కళా
అమరావతి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. 12 కేసుల్లో ఏ1 నిందితుడు జగన్‌కు మద్దతు ఇవ్వడంతోనే ఏపీపై కేసీఆర్‌ కుట్ర ప్రజలకు తెలిసిపోయిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. స్వశక్తితో ఎదుగుతున్న రాష్ట్రంపై హైదరాబాద్‌లో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ సలహాలతోనే పోలవరం, ఇతర ప్రాజెక్టులపై కేసీఆర్‌ కేసులు వేశారని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కేసీఆర్‌, జగన్‌ ఆటలు సాగవనే భయం తమకి పట్టుకుందని చెప్పారు. దొంగ పాస్‌పోర్టులతో కేసీఆర్‌, దొంగ కంపెనీలతో జగన్‌ ప్రస్థానాలు ప్రారంభమయ్యాయని కళా విమర్శించారు.
జనసేనపై దాడికి ఖండన
గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన కార్యకర్తలపై వైకాపా దాడిని మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. వైకాపా రౌడీలను బహిష్కరించాలంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘వైఛీపీ’ అంటూ ఘాటుగా స్పందించారు. మహిళలని కూడా చూడకుండా రాళ్లు రువ్వటం సభ్య సమాజానికే సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారంలో శనివారం రాత్రి వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో జనసేన మహిళా కార్యకర్త ధనలక్ష్మి గాయపడ్డారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆమెతోపాటు మరికొందరు మహిళలు కళాజాత నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగిందని జనసేన నేతలు తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, జిల్లా సమన్వయకర్త మాధా రాధ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి కార్యకర్తను పరామర్శించారు.