జగన్‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ కుట్ర!జగన్‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ కుట్ర! –

 ఆపరేషన్‌ గరుడ.. నిజమేననిపిస్తుంది
– అందులో భాగంగానే జగన్‌పై కావాలని స్వల్ప దాడి
– దాడి నెపంతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు యత్నం
– ప్రత్యేక¬దా అడిగినందుకు ఇన్ని కుట్రలు చేస్తారా?
– 40ఏళ్లుగా పద్దతిగా రాజకీయాల్లో కొనసాగుతున్నా
– ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలకు భయపడేది లేదు
– రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు
– రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం తీరుంది
– గవర్నర్‌ నేరుగా అధికారులతో మాట్లాడితే నేనెందుకు?
– కేంద్రానికి గూఢాచారిగా వ్యవహరిస్తున్నాడు
– గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలి
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, అక్టోబర్‌26(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే శివాజి చెప్పినట్లు ఏపీలో ఆపరేషన్‌ గరుడ పక్కాగా అమలవుతున్నదనే అనుమానాలు కలుగుతున్నాయని, జగన్‌పై జరిగిన దాడి తరువాత పరిణామాలు చూస్తుంటే ఆపరేషన్‌ గరుడ పక్కాగా అమలవుతున్నట్లు అనుమానంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో రెండవ రోజు చంద్రబాబు మాట్లాడారు. జగన్‌ను అడ్డుపెట్టుకొని బీజేపీ కుట్రలు తెరలేపుతుందని అన్నారు. ప్రతిపక్షనేత జగన్‌కు కావాలని ప్రాణహానిలేని దాడిచేసి.. రాష్ట్రమంతా అల్లర్లు సృష్టించి, ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలనుకున్నారని చంద్రబాబు తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల గూండాలను తీసుకొచ్చి అరాచకం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్‌ గరుడ స్కిప్టుల్రో రాసింది రాసినట్టుగా ఇప్పుడు జరుగుతోందన్నారు. దాడి జరిగిన గంటలోపే డీజీపీకి గవర్నర్‌ ఫోన్‌ చేశారని, వైసీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారని, పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు తగలబెట్టారన్నారు. నేరాలు చేసే వ్యక్తులు రాజకీయ ముసుగులో ఉంటే  ప్రమాదమన్నారు.తనను కాదని నేరుగా డీజీపీకి ఫోన్‌ చేసే అధికారం గవర్నర్‌కు ఎక్కడుందని ప్రశ్నించారు. గవర్నర్‌ నేరుగా అధికారులతో మాట్లాడితే సీఎంగా తానెందుకని ప్రశ్నించారు. గవర్నర్‌ వ్యవస్థే వద్దని సీఎం పేర్కొన్నారు. గవర్నర్‌ కేంద్రానికి గూఢచారిలా వ్యవహరించడం మినహా ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తుఫానుపై స్పందించని కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలు జగన్‌ దాడి విషయంలో వెంటనే సానుభూతి తెలిపారన్నారు. ఎన్నడూ లేనివిధంగా ఐటీ సామూహిక దాడులు చేస్తోందని, ప్రత్యేక¬దా అడిగినందుకు ఇన్ని దాడులు చేస్తారా అని చంద్రబాబు నిలదీశారు. సీబీఐ విషయంలో అర్ధరాత్రి డ్రామా చేశారని సీఎం వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన పనులను అడిగితే అణచివేసే ధోరణి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సాయం చేయదు…చేయనివ్వదని విమర్శించారు. పద్ధతిగా రాజకీయాలు చేశానని, ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో దేవాలయాల దగ్గర కుట్రలు చేస్తారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలను వివాదాస్పదం చేయాలని చూశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రమణదీక్షితుల ద్వారా బురద జల్లించారని సీఎం అన్నారు.
వైసీపీ ఉచ్చులో పడ్డానని విమర్శలు చేశారని, కేసీఆర్‌ కన్నా పరిణితి తక్కువ అని విమర్శలు చేశారని అయినా అవన్నీ పట్టించుకోనని తెలిపారు. ఏ రాజకీయ నాయకుడూ ఎదుర్కోనన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. అరాచక శక్తుల ఆగడాలకు కళ్ళెం వేయాలన్నారు. పులివెందుల ప్రజలు రౌడీయిజానికి భయపడి.. వేరే వ్యక్తులకు ఓటేయ్యడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. తాజా పరిణామాలపై పోలీస్‌శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిణామాలనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా కావాలని చంద్రబాబు సూచించారు.