జగన్ పాలన రాబోతోంది: వైకాపా
విజయనగరం,అక్టోబర్10(జనంసాక్షి): రాష్ట్రంలో త్వరలో నూతన శకం ప్రారంభం కానుందని, యువ నేతల పాలన రాబోతుందని వైసిపి రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు విజయ్ చందర్ ఆశాభావం వ్యక్తపరిచారు. బుధవారం విజయ్ చందర్ విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా జగన్, ప్రతిపక్ష నేతగా పవన్ ఉండాలని రాష్ట్రంలో అంతా కోరుకుంటున్నారన్నారు. జగన్ నాయకత్వంలో వైసిపి 125 సీట్లకు పైగా గెలుచుకోనుందన్నారు. ఇప్పటి వరకు నాయకులు మాట్లాడితే ప్రజలు విన్నారని, ఇకపై ప్రజల సమస్యలను ప్రజల నోటి నుండి చెప్పించి, వినే ట్రెండ్ కు జగన్ నాంది పలికారని చెప్పారు. విశాఖపట్నం, విజయనగరంలో జగన్ పాదయాత్రతో రాష్ట్రంలో సమూల మార్పులు స్పష్టంగా వచ్చాయని తెలిపారు. చంద్రబాబు, ప్రజలను మోసం చేశారని, చంద్రబాబుకు అసలైన మోసం ఎలా ఉంటుందో తెలుగు ప్రజలు త్వరలో రుచి చూపిస్తారని ఎద్దేవా చేశారు.