జన్మభూమి కమిటీల పేరుతో.. సర్పంచుల హక్కులను హరించారు

– పంచాయతీరాజ్‌ చట్టాన్ని నిర్వీర్యం చేశారు
– రాష్ట్రంలో ప్రతిప్రాజెక్టు టీడీపీ నేతల కలెక్షన్లకూ కేంద్రమైంది
– ప్రజాధనాన్ని అస్మదీయులకు దోచిపెడుతున్నారు
– ప్రశ్నిస్తే తెలుగుజాతిపై దాడి అని అనడం ఎంతవరకు సమంజసం
– అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా?
– ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ
– చంద్రబాబుకు మరో ఐదు ప్రశ్నలతో లేఖాస్త్రాన్ని సంధించిన కన్నా
గుంటూరు, అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచుల హక్కులను హరించి, పంచాయతీరాజ్‌ చట్టాన్ని నిర్వీర్యం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  17వసారి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం లేఖాస్త్రం సంధించారు. ఈ దఫా మరో ఐదు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు రాకపోతే దాని బాధ్యత విూరు వహించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.  టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా ఐటీ దాడులు చేయిస్తుందని గగ్గోలు పెడుతుండటం సిగ్గుచేటన్నారు. గత ఆరు సంవత్సరాల్లో ఎడ్కో(ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు సీఎం రమేష్‌ రిత్విక్‌ సంస్థ రూ.12 కోట్లు చెల్లిస్తే, ఆ అడ్రస్‌లో ఆ కంపెనీనే లేదని, ఆ సంస్థ ప్రతినిధి సాయిబాబా రిత్విక్‌ కంపెనీ అకౌంటంట్‌ కాదని విూరందరూ ప్రకటించగలరా అని ప్రశ్నించారు.  ఏపీని నిలువునా దోచి, వేల కోట్ల కాంట్రాక్టులను విూ బినావిూ అయిన రమేష్‌ కంపెనీలకు ఇష్టారాజ్యంగా ఇచ్చి అక్కడ నుంచి విూరు వెనక్కు తెచ్చుకోవడం ఏమి నైపుణ్యం అని ప్రశ్నించారు. ఇలాంటి అనాగరిక సంస్కారహీనుడైన వ్యక్తి రాజ్యసభకా, ఆయనకున్న అర్హత విూ బినావిూ కావడమేనని, అలా పంపినందుకు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కన్నా డిమాండ్‌ చేశారు. నీరు-చెట్టు పథకంలో భాగంగా సెక్రటేరియట్‌ దగ్గర నాటిన మొక్కలకు సంబంధించి చేసిన కోట్లాది రూపాయల అవినీతిని ఇంకా ప్రజల మరచిపోక ముందే కుప్పం నియోజకవర్గంలో పంచిపెట్టేందుకు ఒక్కో క్రికెట్‌ బ్యాట్‌ను రూ.6 వేలకు కొని, ప్రతీ డిపార్టుమెంటులో అవినీతి ఉండాల్సిందేనని నిరూపించారు. జీఓ ఆర్టీ నెంబర్‌.413, యూత్‌ అడ్వాన్స్‌మెంట్‌, టూరిజం, కల్చర్‌(స్పోర్‌ట్ట్స్‌ అండ్‌ యూత్‌ సర్వీస్‌) శాఖ, 16-10-2018 తేదీన 250 క్రికెట్‌ బ్యాట్‌లను మెస్సర్‌ ఎక్సెల్‌ స్పోర్‌ట్ట్స్‌ వారి నుంచి రూ.15 లక్షలకు కొన్ని మాట అబద్ధమా అని ప్రశ్నించారు. విూ నియోజకవర్గంలో పంచే క్రికెట్‌ బ్యాట్లలో కూడా అవినీతికి పాల్పడింది వాస్తవం కాదా అని నిలదీశారు. అస్తమానం విూరు, విూ అనుచరులు కేంద్రం నుంచి ఎలాంటి సాయం సహకారం లేదని గగ్గోలు పెడుతుండటం ఎంతవరకు సమజసమని ప్రశ్నించారు. సాక్షాత్తూ ఏపీ చీఫ్‌ సెక్రటరీ దినేష్‌ కుమారే దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ జాతీయ గ్రావిూణ ఉపాధి పథకం కింద అత్యధికంగా నిధులు వచ్చాయని చెబుతున్నారని అన్నారు. అందువల్ల 1776 గ్రామపంచాయతీ భవనాలను, 4843 అంగన్‌వాడీ భవనాలకు, 15వేల కి.విూల సీసీ రోడ్లను, 2.46 లక్షల పంట కుంటలను నిర్మించుకున్నామని చీఫ్‌ సెక్రటరీ చెప్పలేదా, ముఖ్యమంత్రిగా ప్రజలను మోసం చేయడం అన్యాయం కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రతిప్రాజెక్టు టీడీపీ నేతలకు కలెక్షన్లకూ కేంద్రమైందని కన్నా విమర్శించారు. ప్రాజెక్టులన్నీ విూ బినావిూలకు అప్పగించడం, అంచనాలు పెంచడం, నిధులన్నీ దోచిపెట్టడం, ఆ నిధులన్నీ మరలా విూ దగ్గరకు రావడం చూస్తూనే ఉన్నామన్నారు. కృష్ణా నదిపై వైకుంఠాపురం బ్యారేజ్‌ నిర్మాణం అంచనాలను రెండుసార్లు ఎందుకు పెంచాల్సి వచ్చిందో, రెండుసార్లు టెండర్లను ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో ప్రజలకు వివరించాలని కన్నా డిమాండ్‌ చేశారు. ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా విూ అస్మదీయులకు దోచిపెట్టడం, ప్రశ్నిస్తే తెలుగు జాతి విూద దాడి అని ఎదురు దాడి చేయడం విూకు పరిపాటి అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుజాతి గౌరవాన్ని విూ స్వార్ధానికి బలి చేస్తున్నారని, ఈ విషయంపై సీబీఐ విచారణకు సిద్ధమా అని కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబును డిమాండ్‌ చేశారు.