జమిలి ఎన్నికలపై మీరేంచెప్తారు? ` భారాస వైఖరిని అడిగిన రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి):జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. జమిలి ఎన్నికలకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.హైదరాబాద్ గాంధీభవన్‌లో రేవంత్ మాట్లాడారు. రాష్ట్రాల హక్కులను హరించడానికే భాజపా జమిలి ఎన్నికల ప్రస్థావన తెస్తోందని విమర్శించారు.’’కొద్దిరోజులుగా దేశంలో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుతం భాజపా మాయ మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కర్ణాటకలో గల్లీగల్లీ తిరిగినా.. ప్రధాని మోదీ, అమిత్‌షా 30 రోజులు ప్రచారం చేసినా భాజపా గెలవలేదు. మణిపుర్ అంశంపై పార్లమెంట్‌లో మోదీ నోరెత్తలేదు. మణిపుర్‌పై చర్చించుకుండా ప్రజలను పక్కదారి పట్టించారు. వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపని సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు వస్తున్నాయని తేలింది. భారాసకు 31 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది.భాజపాకు ఓటమి తెలిసే తెరపైకి వన్ నేషన్ ` వన్ ఎలక్షన్ తీసుకొస్తుంది. ‘ఇండియా’ కూటమి జమిలి ఎన్నికలకు వ్యతిరేకం. జమిలి ఎన్నికల కమిటీ సభ్యుడిగా అధీర్ రంజన్ వైదొలిగారు. భాజపా, భారాస ఒకే తాను ముక్కలు. దీనికి భారాస అనుకూలంగా ఉంది. జమిలి ఎన్నికలకు సమ్మతి తెలుపుతూ 2018లో సీఎం కేసీఆర్ లేఖ రాశారు. జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం. అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే వన్ నేషన్ ` వన్ ఎలక్షన్ తీసుకురావాలని చూస్తున్నారు. అధ్యక్ష తరహా ఎన్నికలు వస్తే దక్షిణాది ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది’’ అని రేవంత్ ఆరోపించారు.
అభ్యర్థుల ఎంపికలో అపోహలకు గురి కావొద్దు
ప్రదేశ్ ఎన్నికల కమిటీ(పీఈసీ) ఎంపిక చేసిన జాబితాను.. సీల్డ్ కవర్‌లో స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.3 రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌లోనే ఉంటుందన్నారు. సోమవారం పీఈసీ సభ్యులతో వేర్వేరుగా స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటుందన్నారు. మంగళవారం డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో కమిటీ సమావేశమవుతుందన్నారు. ఈనెల 6న స్క్రీనింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పీఈసీ ఇచ్చిన నివేదికపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుందన్నారు. స్క్రీనింగ్ కమిటీ తయారు చేసిన జాబితా.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిస్తుందన్నారు. వీలైనంత తర్వలో మొదటి జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు.కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే జాబితానే ఫైనల్ అని.. అప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా తనకు కూడా సమాచారం ఉండదన్నారు. ‘’ అభ్యర్థుల ంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఈసారి అభ్యర్థుల్లో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయబోతున్నాం. స్థానిక పరిస్థితులు, సామాజిక వర్గాలు ఆధారం చేసుకుని బీసీ అభ్యర్థులను ఎంపిక చేస్తాం. అభ్యర్థుల ఎంపికలో ఎవరూ ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదు’’ అని రేవంత్ వివరించారు.