జాతీయ బ్యాంకులను నష్టపరిచే వ్యవహారం

– ప్రైవేటు బ్యాంకులకు ప్రభుత్వ వ్యాపారం

– ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ కీలక నిర్ణయం

న్యూఢిలీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు బ్యాంకులకు ఉపయోగపడేలా శుభవార్తను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ వాణిజ్య కార్యకలాపాల్లో ఇకపై ప్రైవేటు బ్యాంకులు పాలుపంచుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకు ప్రభుత్వ వాణిజ్య కార్యక్రమాల్లో ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే పాల్గొనేవి. ప్రైవేట్‌ బ్యాంకులపై ఉన్న మారటోరియంను ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై ప్రైవేటు బ్యాంకులు కూడా ప్రభుత్వ వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొననున్నాయి.ఈ నిర్ణయంతో ఇకపై ప్రభుత్వ కార్యకలాపాల్లో అన్ని బ్యాంకులకు సమాన అవకాశాలు దక్కనున్నాయి. ప్రైవేట్‌ బ్యాంకులకు సమాన అవకాశాలతో ఆర్థిక వ్యవస్థలో వద్ధి సాధ్యమని ప్రభుత్వం నమ్ముతున్నది. ఈ నిర్ణయంతో వినియోగదారులకు అందించే ట్యాకులు, పెన్షన్లు, సేవింగ్స్‌ పథకాల్లో సేవలు మరింత మెరుగవుతాయని కేంద్రం భావిస్తున్నది. ఇతర ప్రభుత్వ వ్యాపారాలను చేపట్టడానికి ప్రైవేటు రంగ బ్యాంకులకు ఇప్పటినుంచి ఆర్బీఐ అధికారం ఇస్తుంది. ఎన్‌ఎస్‌ఈలో సాంకేతిక స్నాగ్‌ తర్వాత మార్కెట్లు తిరిగి ట్రేడింగ్‌ ప్రారంభించడంతో ఆర్థిక మంత్రి ప్రకటించిన ఈ నిర్ణయం నేపథ్యంలో నిఫ్టీ సూచీ పెరిగి 36,493.80 వద్దకు చేరుకున్నది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా వెలుగులోకి వచ్చి వాటి లాభాలు 4-5 శాతం పెరిగాయి. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,050 పాయింట్లకు పైగా పెరిగింది.