జిఎస్టీతో మరింత కుదేలు కానున్న రియల్ రంగం
న్యూఢిల్లీ,జనవరి18(జనంసాక్షి): రియల్ రంగాన్ని జిఎస్టీలోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇఇది అమల్లోకి వస్తే ఇక సామాన్యులకు ఇల్లు కొనుక్కునే భాగ్యం ఉండబోదు. ఇప్పటికే నగరాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. నిర్మాణ వ్యవయం భారీగా పెరిగింది. జిఎస్టీ బాదుడు తోడయితే మధ్యతరగతి ప్రజలు కుదేలు కావాల్సిందే. పెద్ద నోట్ల రద్దుతో దేశీయ రియల్ ఎస్టేట్ రంగం కకావికలమయ్యాక ప్రోత్సాహకాలు ఉంటాయనుకుంటే అందుకు అనుగుణంగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడలేదు. నిర్మాణరంగంలో ఉన్న కూలీలు ఉపాధి లేకుండా పోయారు. అమ్మకాలు, కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. వడ్డీరేట్లు తగ్గితే కొంతయినా ఈ రంగం నిలబడుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురయ్యింది. భూముల ధరలు తగ్గుతాయని, సామాన్యుడికి ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుందని కేంద్రం జిఎస్టీ అమలు సందర్భంగా పదేపదే చెప్పినా అలాంటి వెసలుబాటు ఏదీ రాలేదు. అందరికీ ఇల్లు అన్న ఆశ అడుగంటింది. మొత్తంగా గృహనిర్మాణ రంగం లేదా రియల్ రంగం బాగా కుదేలయ్యింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు పడిపోయిన రియల్ ఎస్టేట్ విక్రయాలు మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడు పతనం చెందాయని విశ్లేషకులు అన్నారు. గడిచిన రెండు నెలల్లో రెసిడెన్షియల్ మార్కెట్‌పై తీవ్రస్థాయిలో ప్రభావం పడిందన్నారు. ముఖ్యంగా సెకండరీ విక్రయాలకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు. 2010 తర్వాత ఇంతటి స్థాయిలో అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారి..అలాగే నూతన ఇండ్ల ప్రారంభాలు 61 శాతం క్షీణించిందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు క్షీణించాయని రియల్ రంగాల్లో ఉన్నవారు వెల్లడిస్తున్నారు. ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగ సంస్థల విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో డెవలపర్లలో భయాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. నూతన ప్రాజెక్టులను ప్రకటించడానికి జంకుతున్నారు. ఇక జిఎస్టీ కూడా తోడయితే మరింతగా పడిపోవడం ఖాయమని బెంబేలెత్తుతున్నారు.