జిల్లాలో తిత్లీ తుఫాను ప్రభావంపై స్పీకర్‌ ఆరా

వివరాలు అందచేసిన జిల్లా అధికార యంత్రాంగం

శ్రీకాకుళం,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): జిల్లాలో తిత్లీ తుఫాను ప్రభావానికి జరిగిన నష్టాన్ని తీసుకున్న పునరావాస, సహాయ, పునరుద్ధరణ పనుల వివరాలను అధికారులు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు వివరించారు. మంగళవారం స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు శ్రీకాకుళంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి చేరుకున్నారు. జిల్లాకు చేరుకున్న స్పీకర్‌ను ప్రభుత్వ విప్‌ రవికుమార్‌, కలెక్టర్‌ కె.ధనంజయ రెడ్డి, జిల్లా

సంయుక్త కలెక్టర్‌ కెవిఆర్‌ బాబు మర్యాదపూర్వకంగా కలుసుకొని స్వాగతించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సర్వే బృందాలు పర్యటించి బాధితుల వివరాలు సేకరించి పంట, ఆస్తి నష్టం నమోదు చేసినట్లు స్పీకర్‌కు వివరించారు.. బాధితులకు పరిహారం పంపిణీకి తీసుకుంటున్న చర్యలను తెలిపారు. జెసికెవిఎన్‌ చక్రధర బాబు బాధితులకు పంపిణీ చేసిన బియ్యం, ఇతర సరుకులు వివరాలను స్పీకర్‌కు వివరించారు. తరవాత స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌ స్వదేశీ మత్స్యకారుల (కండ్ర కులస్థుల) గ్రామాన్ని సందర్శించారు. ముందుగా ఇళ్లపై ఉన్న రేకులు తిత్లీ తుఫానుకు ఎగిరి పోయిన ఇళ్ళను ఆయన పరిశీలించారు. తమ వలలు పోయాయని గ్రామస్తులు స్పీకర్‌కు విన్నవించారు.సోంపేట, ఎర్రముక్కాం గ్రామస్తులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని అండగా ఉంటుందన్నారు. అనంతరం మండల ప్రాధమిక పాఠశాలలో గ్రామస్తులను పరామర్శించి, ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకులు, నీరు అందుతున్నదీ లేనిది ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

తుపాన్‌ నష్టంపై అధికారులతో కలెక్టర్‌ సవిూక్ష

జిల్లాలో తుఫాను నష్టపరిహార జాబితా పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి ఆదేశించారు. నష్ట పరిహార జాబితా తయారి, గ్రామాల్లో ప్రదర్శనపై సంబంధిత అధికారులతో ధనుంజయరెడ్డి మంగళవారం టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుంజయరెడ్డి మాట్లాడుతూ.. నష్ట పరిహార జాబిత వేగవంతంగా తయారు చేయడం జరిగిందన్నారు. అదే సమయంలో వాటిలో లబ్దిదారుల పేర్లు, బ్యాంకు అకౌంటు నంబరు, ఆధార్‌ నంబరు తదితర వివరాలలో తప్పులు లేకుండా సరిచూడాలని ఆదేశించారు. 25 వ తేదీ వరకు అభ్యంతరాలు తెలియజేయవలసినదిగా కోరడమైందన్నారు. మండల ప్రత్యేక అధికారులు, మండల, గ్రామ స్థాయి అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి జాబితాల్లో ఎలాంటి లోపాలు లేకుండా తయారు కావడానికి చర్యలు చేపట్టాలన్నారు. లబ్దిదారుల నుండి అందిన అభ్యంతరాలు ఎప్పటికప్పుడు తాజా పరచాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన నమోదులు మినహా మిగిలిన శాఖల నమోదు పూర్తి అయిందని ధనుంజయ తెలిపారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన నమోదులు 25 నుండి 30 వేలు వరకు ఉందని, ఈ జాబితాలను గ్రామాల్లో ప్రదర్శించడం జరుగుతోందని పేర్కొన్నారు. 3 రోజులు అత్యంత క్రియాశీలక దినాలని, ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. అలక్ష్యం వహించే వారిపై వేటు పడుతుందని హెచ్చరించారు. విధుల పట్ల నిర్యక్ష్యం వహించే వారిపై చర్యలు చేపట్టాలని మండల ప్రత్యేక అధికారులను సైతం ధనుంజయ రెడ్డి ఆదేశించారు.