జిహెచ్‌ఎంసి పరిధిలో వందశాతం వ్యాక్సినేషన్‌


సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌: సిఎస్‌ వెల్లడి
హైదరాబాద్‌,అగస్టు21(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో సోమవారం నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. 10 నుంచి 15 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగనుందని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ కోసం మొత్తం 175 సంచార టీకా వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 సంచార టీకా వాహనాలు.. కంటోన్మెంట్‌ పరిధిలో 25 మొబైల్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సోమేశ్‌ కుమార్‌ వివరించారు. జీహెచ్‌ఎంసీలో 4,846 కాలనీలు, బస్తీల్లో.. కంటోన్మెంట్‌ పరిధిలోని 360 ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపడతామని చెప్పారు. ప్రత్యేక డ్రైవ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీఎస్‌ కోరారు. ఇంటింటికి వెళ్లి టీకాలు వేసుకోని వారిని గుర్తించాలని సిబ్బందికి ఆయన సూచించారు.