జీవవైవిధ్యానికి పులుల సంరోణ ముఖ్యం

అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే
ఇండియా ఫర్‌ టైగర్స్‌ ఏ ర్యాలీ ఆన్‌ వీల్స్‌ ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జంతుజాలంను రక్షిస్తేనే అడవుల సంరక్షణ కూడా కొనసాగుతోందన్నారు. సోమవారం అరణ్య భవన్‌ వద్ద పులుల సంరక్షణ కోసం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ’ చేపట్టిన ఇండియా ఫర్‌ టైగర్స్‌ ఏ ర్యాలీ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌` వేడుకల్లో భాగంగా దేశంలోని అన్ని టైగర్‌ రిజర్వ్‌ లను కలుపుతూ పులుల సంరక్షణ కోసం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ ఇండియా ఫర్‌ టైగర్స్‌ ఏ ర్యాలీ ఆన్‌ వీల్స్‌ ను అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పెద్ద పులులను సంరక్షణపై ప్రజలల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీసీఏ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. పులుల ఆవాసాల రక్షణ, విస్తరణకు ప్రజల మద్దతు అవసరమని, పులుల సంరక్షణ గురించి అవగాహన కల్పించ డానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. ర్యాలీ ఇక్కడి నుంచి కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఈ ప్రాంతం వరకు కొనసాగుతుందని వెల్లడిరచారు. అక్కడి నుంచి మహారాష్ట్ర ఇలా ఒడిషాలోని సిమిలిపాల్‌ టైగర్‌ రిజర్వ్‌ వద్ద ర్యాలీ ముగుస్తుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో త్రికోణ అగ్రభాగాన నిలిచిన పులులను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అడవుల్లో జీవ వైవిధ్యానికి పెద్దపులులే కీలకం కావున జీవ వైవిధ్యం సమతూకంలో కొనసాగాలంటే అడవుల్లో పెద్ద పులుల సంతతి వృద్ధి చేందేలా రక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పులుల సంరక్షణ, వాటి సంతతి వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు మన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వెల్లడిరచారు. పులుల సంరక్షణ పట్ల తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తుందన్నారు. తెలంగాణలోని రెండు టైగర్‌ రిజర్వ్‌ లలో పులుల సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. పులుల సంరక్షణతోనే
అడవుల రక్షణ సాధ్యం అవుతుందని పీసీసీఎఫ్‌ ఆర్‌. శోభ అన్నారు. పులుల మనుగడకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరముందని తెలిపారు. జీవవైవిధ్యంలో పులులు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీసీఏ ఈ ర్యాలీ చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి, పీసీసీఎఫ్‌ (సోషల్‌ ఫారెస్టీ) ఆర్‌.ఎం. డోబ్రియల్‌, పీసీసీఎఫ్‌ (కంపా) లోకేష్‌ జైస్వాల్‌, పీసీసీఎఫ్‌ (అడ్మిన్‌) స్వర్గం శ్రీనివాస్‌, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.