జెట్‌ఎయిర్‌వేస్‌ యాజమాన్యానికి సహాయం చేస్తాం

– జీతాల్లో కోత విధింపును మాత్రమే వ్యతిరేకించాం
– వెల్లడించిన పైలెట్ల యూనియన్‌
న్యూఢిల్లీ, ఆగస్టు4(జ‌నం సాక్షి) : ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ జెట్‌ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు తమ వంతుకృషి చేస్తామని సదరు సంస్థ పైలెట్‌ యూనియన్‌(ఎన్‌ఏజీ) వెల్లడించింది. ఖర్చులు తగ్గించుకునేందుకు తాము సహకరిస్తామంటూ యూనియన్‌ ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జీతాల్లో కోత విధించాలనే నిర్ణయాన్ని మాత్రం పైలెట్లు వ్యతిరేకించారని, కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలపై మేం సమావేశమై చర్చించామన్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకు మేం అందరం యాజమాన్యానికి సహకరిస్తామన్నారు. మా కంపెనీ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేలా చేసేందుకు మావంతు కృషి చేస్తామని పైలెట్ల యూనియన్‌ నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌(ఎన్‌ఏజీ) వెల్లడించింది. ఈ ఎన్‌ఏజీ యూనియన్‌లో దాదాపు 1100 మంది సభ్యులుగా ఉన్నారు. ఇంధన వ్యయాలు పెరగడం, రూపాయి విలువ క్షీణించడం, తక్కువ ధరలకే టికెట్లు అమ్ముతూ విమానాశ్రయ సంస్థల మధ్య పోటీ నెలకొనడం వల్లే ఇటువంటి సమస్యలు వస్తున్నట్లు యూనియన్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. తక్కువ కాలంలోనే తమ సంస్థ మళ్లీ పుంజుకుంటుందని ఎన్‌ఏజీ అభిప్రాయపడింది.
నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల జెట్‌ఎయిర్‌వేస్‌ కష్టాలను ఎదుర్కొంటుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చుల భారం తగ్గించుకోకపోతే ఎయిర్‌లైన్‌ను 60రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగించలేమని, అందువల్ల పైలెట్లతో పాటు ఇతర సిబ్బంది జీతాల్లో కోత విధించాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతిపాదన పెట్టింది. 60రోజుల కంటే ఎక్కువ రోజులు కొనసాగలేదని వస్తున్నవి తప్పుడు వార్తలను, సంస్థకు హాని కలిగించేందుకు ఇటువంటి వదంతులు ప్రచారం చేస్తున్నారని సంస్థ సీఈవో వినయ్‌ దూబే కొట్టిపారేశారు.