జెట్‌ ఎయిర్‌వేస్‌ను బయటపడేసే యత్నం

కొనుగోలు చర్చల్లో టాటా గ్రూపు

ముంబయి,నవంబర్‌13(జ‌నంసాక్షి): నష్టాల్లో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు చేసి, సంస్థ నిర్వహణ బాధ్యతలను దక్కించుకొనేందుకు టాటా సంస్థ చర్చలు జరుపుతోంది. టాటా సన్స్‌కు చెందిన ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ) సౌరభ్‌ అగర్వాల్‌ ఈ చర్చలకు నేతృత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూపునకు చెందిన బృందం జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ నరేశ్‌ గోయల్‌తో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించేందుకు బలమైన పెట్టుబడి దారుల కోసం చూస్తున్నట్టు గత నెలలో నరేశ్‌ గోయల్‌ తెలిపిన విషయం తెలిసిందే. సంస్థలో వాటా అమ్మి నిధులు సమకూర్చుకునేందుకు ఆయన టాటా గ్రూపు సహా కొన్ని సంస్థలను సంప్రదించారు. ఆసక్తి చూపిన టాటా సంస్థ .. నిర్వహణ హక్కును తమకే అప్పగించాలని కోరింది.టాటా సన్స్‌కు చెందిన ఉన్నతాధికార బృందం జెట్‌ ఎయిర్‌వేస్‌తో చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశాలున్నాయి. అని ఈ ఒప్పందంతో సంబంధమున్న వ్యక్తి ఓ జాతీయ వార్తా సంస్థకు తెలిపారు. కొన్ని షరతుల మధ్య నిర్వహణ బాధ్యతను టాటాకు అప్పగించేందుకు నరేశ్‌ గోయల్‌ అంగీకరించినట్లు మరో అధికారి తెలిపారు. కానీ ఎంత మొత్తానికి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారనే అంశంపై స్పష్టత లేదని అన్నారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు రెండు సంస్థల అధికార ప్రతినిధులు నిరాకరించారు. ఇప్పటికే టాటా సంస్థ సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి దేశీయంగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ను నడుపుతోంది. ఎయిర్‌ ఏసియాలోనూ 49 శాతం వాటా కలిగి ఉంది. జెట్‌ ఎయిర్‌వేస్‌తో ఒప్పందం విజయవంతం అయితే దేశీయ విమానయాన రంగంలో టాటా సంస్థ వాటా 8.2 శాతం నుంచి 24 శాతానికి పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో తైమ్రాసికంలో తమ సంస్థ రూ.1,261 కోట్ల ఏకీకృత నష్టాన్ని నమోదు చేసినట్లు సోమవారం జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే తైమ్రాసికంలో సంస్థ రూ.71 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇంధన ధరల

పెరుగుదల, రూపాయి మారకపు విలువ క్షీణిస్తుండడం.. ఈ భారీ నష్టాలకు కారణమని సంస్థ తెలిపింది.