జోషి వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందన

వెనక్కి తీసుకున్న జోషి

న్యూఢిల్లీ,నవంబర్‌23(జ‌నంసాక్షి): హిందూమతం గురించి కేవలం బ్రాహ్మణులు మాత్రమే మాట్లాడాలి అని కాంగ్రెస్‌ నేత సీపీ జోషి ఇటీవల ఓ వివాదాస్పద కామెంట్‌ చేశారు. రాజస్థాన్‌లో ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సీరియస్‌ అయ్యారు. జోషీ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. జోషీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయని రాహుల్‌ అన్నారు. కేవలం ప్రధాని మోదీనో లేక ఇతర బీజేపీ నేతలో హిందూ మతం గురించి మాట్లాడడం కాదు అని, హిందూ మతం గురించి కేవలం బ్రాహ్మణులు మాత్రమే మాట్లాడాలని సీపీ జోషీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆ అంశంపై రాహుల్‌ తన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీసే విధంగా ప్రకటనలు చేయరాదు అని, పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ జోషి క్షమాపణలు చెప్పాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. దీంతో జోషి స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు. ఎవరైనా బాధపడితే క్షమించాలని జోషి కోరారు.