టిఆర్‌ఎస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి

అధికారమత్తులో ఉన్నవారికి అవతలి వారు కనిపించరు.వెంటవున్న వారు చెబితే వినిపించదు.రాజకీయాల్లో తనకు తోచిన పనిచేయడం కాకుండా ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటనే మంచి ఫలితాలు వస్తాయి. ఒకటికి రెండుసార్లు చర్చించాల్సి ఉంటుంది. మంచిచెడులపై తర్జనభర్జన పడాలి. తాము ఇంతకాలం చేస్తున్నదంతా మంచిదే అనుకుని..అదే పిడివాదంపైనా నిలబడడం కూడా సరికాదు. తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తయితే.. పాలనా పగ్గాలు చేపట్టిన తరవాత తెచ్చుకున్న తెలంగాణను ముందుకు తీసుకుని వెళ్లడం మరో ఎత్తు. ముందుకు వెళ్లే క్రమంలో మనవెంట ఎవరెవరు ఉన్నారన్నది ముఖ్యం. ఉద్యమంలో నడిచిన చరిత్ర వారికి ఉందా అన్నది చూసుకోవడంలోనే ఉద్యమ నేత కెసిఆర్‌ విఫలమయ్యారు. ఫక్తు రాజకీయ పార్టీ నేతగా మారి పాలన నెత్తికెత్తుకోవడం వల్ల ఆయనచుట్టూ మళ్లీ రాజకీయ నేతలే చేరారు. వారి ప్రాధాన్యం రాజకీయాలే అవుతాయి కానీ తెలంగాణ ఆకాంక్షలు కావు. ..తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస యాదవ్‌, మహేందర్‌ రెడ్డి లాంటి వారికి తెలంగాణ ఉద్యమంలో ఏ మాత్రం పాత్రా లేదు. కెసిఆర్‌ అధికారం లోకి వచ్చాక వీరంతా ఆయన పంచన చేరారు. కోదండరామ్‌ మొదలు అనేకులు బయట ఉండి పోయారు. అందుకే కెసిఆర్‌పై గౌరవం ఉన్నా ఆయన టీమ్‌పై ఎవరికి కూడా విశ్వాసం లేదు. వీరు తెలంగాణ ఉద్యమంలో ఒక్క అడుగు కూడా వేయకుండా అధికారం చెలాయిస్తుంటే సహజంగానే ఎదుటివారికి మండుతుంది. ఇలా గూడుకట్టుకున్న అసమ్మతిపై కెసిఆర్‌ ఎప్పుడూ దృష్టి సారించలేదు. ఏ సందర్బం లోనూ దీనిపై చర్చించలేదు. తాను అనుకున్నది అమలు చేయడం, తీసుకున్న నిర్ణయం సరైనదనే భావన లో ఉండడంతో ఏకఛత్రాధిపత్యానికి బీజాలు పడ్డాయి. విమర్శలను స్వీకరించి సవరించుకునే అవకాశాలను కూడా కెసిఆర్‌ ఏనాడూ పాటించలేదు. ప్రగతిభవన్‌కే పాలన పరిమితం కావడంతో తెలంగాణ యావత్తూ నిర్ఘాంత పోయింది. ఇలాంటి నాయకుడుగా కెసిఆర్‌ మారుతారని ఎవరూ ఊహించలేదు. అందుకే పార్టీలో అసంతృప్తి గూడుకట్టుకుంటూ వచ్చింది. ఇకపోతే ఎన్నికలకు వెళ్లాలని ఏకపక్ష నర్ణయం తీసుకోవడం.. అసమర్థనేతలకు కూడా మళ్లీ టిక్కెట్లు ఇవ్వడం వల్ల సహజంగానే పార్టీని నమ్ముకున్న వారిలో కూడా నైరాశ్యం పెరిగింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూ కబ్జాలపై స్వయంగా కలెక్టర్‌ నివేదిక ఇచ్చారు. ఫలితం..కలెక్టర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పైనా ఆరోపణలు వచ్చాయి. కానీ చర్యలు శూన్యం. ఇక స్టేషన్‌ ఘనాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తాటికొండ రాజయ్య డిప్యూటి సిఎంగా ఉండగా అవినీతి కారణంగా ఉద్వాసనకు గురయ్యారు. అయినా మళ్లీ ఆయనకే టిక్కెట్‌ ఇచ్చారు. అలాగే బాబూ మోహన్‌, బోడిగె శోభ, దుర్గం చినమల్లయ్యలను నిర్దాక్షిణ్యంగా టిక్కెట్లు నిరాకరించారు. కారణం చెప్పలేదు. ఎందరో ఆశావహులకు టిక్కెట్లు వస్తాయను కున్నా రాలేదు. ఈ దశలో కొందరు పార్టీని వీడారు. మరికొందరు వేరే పార్టీ ద్వారా పోటీలో ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి రాజీనామా చేయడం ఒక ఎత్తుగా భావించాలి. ఆయన చూపిన కారణాలు సహేతకుంగా ఉన్నాయి. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, నిరంకుశ వైఖరి ఉందని, ఉద్యమకారులకు చోటు లేదని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం పడాల్సి అసవరం లేదు. ఇద్దరు ఎంపీలు, టీఆర్‌ఎస్‌కి గుడ్‌ బై చెప్పబోతున్నారంటూ ఇటీవల కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం… రేవంత్‌ వ్యాఖ్యల్ని ఖండిస్తూ, ఇద్దరు ఎంపీలు విూడియా ముందుకు వచ్చిన వారిలో ఒకరు సీతారాం నాయక్‌ కాగా, మరొకరు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. అనూహ్యంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసేశారు. పార్టీకీ, ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖని పార్టీ

కార్యాలయానికి పంపించేశారు. ఈ రాజీనామా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమయ్యింది. నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందనీ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను సూచించినవారికి టిక్కెట్లు ఇవ్వలేదనీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పై అసహనంతో వున్నారు. ఆ అసహనాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేసినా, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్‌ లైట్‌ తీసుకోవడంతో పరిణామాలన్నీ వేగంగా మారాయి. సరిగ్గా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ పర్వం ముగియగానే, ఎంపీ రాజీనామా చేయడమంటే చిన్న విషయం కాదు. ఇది పార్టీలో గూడుకట్టుకున్న అసమ్మతికి ప్రబల తార్కాణంగా చూడాలి. కీలకమైన శాసనసభ ఎన్నికలకు కేవలం రెండు వారాల ముందు టీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌గా భావించాల్సిందే. విశ్వేశ్వర్‌ రెడ్డిని బుజ్జగించటానికి మంత్రి కేటీఆర్‌ చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ వ్యవహారాన్ని ఓ ఎంపి రాజీనామాగా చూడరాదు. ఇది పార్టీలో ఉద్యమకారులకు తగ్గిన,తగ్గుతూ వస్తున్న ప్రాధాన్యంగా చూడాలి. అలాగే పార్టీలో ఓ ప్రజాస్వామ్య పద్దతి లేకపోవడం కూడా కారణంగా చూడాలి. కేవలం కొందరు ఓ కోటరీగా చేరి కెసిఆర్‌ను నడిపిస్తున్నారన్న అపప్రధ కూడా ఉంది. ఇది ఎంతవరకు నిజమో కానీ కెసిఆర్‌ ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండరని, దొరకరన్న ప్రచారం తెలంగాణలో బలపడింది. ఇదే విషయాన్ని కెటిఆర్‌ ఇటీవల ప్రెస్‌విూట్‌లో ప్రస్తావించగా పాలన సాగుతుందా లేదా అన్నది చూడాలన్నారు. ప్రజలకు కలవని, అందుబాటులో లేని నాయకుఉడ ఉన్నాడంటే ప్రజలే కాదు, నేతలు కూడా అంగీకరించరు. తానొక్కడినే అంతా అని అనుకుంటే సాగదు. అహం అన్నది మనిషిని దెబ్బతీస్తుంది. అది రాజకీయాల్లో అస్సలు పనిచేయడదు. టిఆర్‌ఎస్‌ మళ్లీ ఉద్యమపార్టీ ముందుకు సాగి, ప్రజలను అక్కున చేర్చుకునే ప్రయత్నాలను తిరిగి కొనసాగించేలా చూసుకోవాలి. ఆత్మపరిశీలనను మించిన అనుభవం లేదు. చేసిన తప్పులను సరిదిద్దుకునే సాహసం చేయడం పార్టీలకు అవసరం. టిఆర్‌ఎస్‌ లాంటి పార్టీ తక్షణం చేయాల్సింది కూడా ఇదే.