టిక్కెట్‌ కష్టాలు.. 

– బస్సులో ఢిల్లీకెళ్లి రాహుల్‌ను కలిసిన మాజీ ఎంపీ రవీంధ్రనాయక్‌
– దేవరకొండ టికెట్‌ ఇవ్వాలని రాహుల్‌కు వినతి
న్యూఢిల్లీ, నవంబర్‌12(జ‌నంసాక్షి) :  టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత తమ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు గడిచినా మహాకూటమిలో మాత్రం ముందడుగు పడలేదు. నేటికీ ఓవైపు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనా సీట్లసర్దుబాటు కాలేదు. మరోవైపు కూటమిలోని పార్టీల నేతలు టికెట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సీట్ల ప్రకటన జాప్యం అవుతున్న కొద్దీ పార్టీ టిక్కెట్‌ తమకే దక్కుతుందని గంపెడు అశలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నేతల పాట్లు వర్ణణాతీతంగా ఉన్నాయి. తమకు సీటు కచ్చితంగా ఇచ్చి తీరాలంటూ కొందరు కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌ వద్ద గత కొన్ని రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. మరికొందరు నేతలు ఢిల్లీలో స్క్రీనింగ్‌ కమిటీని కలుసుకుని సీట్ల కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎంపీగా సేవలందించిన రవీంద్రనాయక్‌ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం వినుత్నంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోని రాహుల్‌ నివాసానికి లంబాడి మహిళలతో రవీందర్‌ నాయక్‌ బస్సులో వెళ్లి ఆయనను కలిశారు. దేవరకొండ టికెట్‌ ఇవ్వాలని రాహుల్‌ను కోరారు. తనకు ప్రజల మద్దతు ఉందని, దేవరకొండ నుంచి అవకాశం ఇవ్వాలని కోరారు రవీందర్‌ నాయక్‌. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల జాబితా వెల్లడికానున్న తరుణంలోనూ నేతల పాట్లు కొనసాగుతున్నాయి. వరంగల్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న ఆశోక్‌గౌడ్‌ కూడా ఢిల్లీలో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కుంతియాలు రాహుల్‌ సోమవారం మధ్యాహ్నం గంటసేపు చర్చించారు. అయితే మరోసారి భేటీ అయ్యాక అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. మరోవైపు తమ సీట్ల లెక్క తేల్చాలని కోదండరామ్‌ పార్టీ టీజేఎస్‌, సీపీఐలు డిమాండ్‌ చేస్తుండటం గమనార్హం.